పల్లె ఇండ్లకు మ్యుటేషన్​ తిప్పలు.. ఏప్రిల్ ​తర్వాత పూర్తిగా నిలిపివేత

పల్లె ఇండ్లకు మ్యుటేషన్​ తిప్పలు.. ఏప్రిల్ ​తర్వాత పూర్తిగా నిలిపివేత
  •     అంతకు ముందువి కొన్ని పెండింగ్
  •     ఆన్​లైన్​ ప్రాబ్లమ్ అంటున్న పంచాయతీ ఆఫీసర్లు 
  •     రిజిస్ట్రేషన్లు ముగిసినా హక్కుదారులు కాని ఓనర్లు
  •     హౌస్​లోన్ తీసుకోలేక అవస్థలు

నిజామాబాద్, వెలుగు : గ్రామ పంచాయతీల పరిధిలో ఇండ్లు కొని రిజిస్ట్రేషన్లు చేసుకున్నా, మ్యుటేషన్లు జరగడం లేదు. దీంతో ఇండ్లు కొన్న ఓనర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్​ చివరి నుంచి మ్యుటేషన్లు నిలిచిపోయాయి. ఆన్​లైన్​ సైట్ ​ప్రాబ్లమ్​ అని సమాధానమిచ్చి ఆఫీసర్లు జారుకుంటున్నారు. రిజిస్ట్రేషన్​ తర్వాత మ్యుటేషన్ ​ప్రక్రియ పూర్తయితేనే కొనుగోలు చేసిన ఇంటిపై యజమానికి పూర్తి హక్కులు లభిస్తాయి. ఈ ప్రక్రియ పూర్తికాక ఇండ్ల కొనుగోలుదారులు బ్యాంకు లోన్లు పొందలేకపోతున్నారు. కరెంట్ ​మీటర్లు, నల్లా కనెక్షన్లు వారి పేర్లపై కావడం లేదు. నిజామాబాద్​ జిల్లాలో ఏప్రిల్ ​నుంచి దాదాపు 6 వేల మంది ఇందుకోసం ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్​ ముందు ఆయా కారణాలతో మండలానికి కనీసం 40 చొప్పున మ్యుటేషన్లు నిలిచిపోయాయి.

రోజుకు యావరేజ్​గా 50 ఇండ్ల రిజిస్ట్రేషన్​

నిజామాబాద్ ​అర్బన్, రూరల్ ​రిజిస్ట్రార్​ ఆఫీసుల్లో ప్రతీరోజు సగటున150 రిజిస్ట్రేషన్లు అవుతాయి. బోధన్, ఆర్మూర్, భీంగల్​లో 40 చొప్పున కలిపి జిల్లాలో రోజు 270  దాకా రిజిస్ట్రేషన్లు జరుతున్నాయి. పట్టణ ప్రాంతాల ఇండ్లను మినహాయిస్తే  గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 50 ఇండ్లు క్రయవిక్రయాలు జరుగుతాయి. ఇలా గడిచిన నాలుగు నెలల్లో సుమారు 6 వేల ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. మండల కేంద్రాలు, అందులోనూ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న మండలాల్లో క్రయవిక్రయాలు అధికంగా ఉంటాయి. డిచ్​పల్లి, ఇందల్​వాయి, భీంగల్, వేల్పూర్, వర్ని, మోస్రా, చందూర్​లో రియల్ ​ఎస్టేట్​ బిజినెస్ ​జోరుగా ఉంటుంది.

ఇండ్లుకొన్న వారు పూర్తి ఓనర్లు ఐతలేరు

ఇంటిని కొనుగోలు చేసిన కొత్త ఓనర్​ పేరును పంచాయతీ, మున్సిపల్​ రికార్డుల్లో నమోదు చేయడమే మ్యుటేషన్. ఇంటి పన్ను, నీటి పన్ను తదితర వాటికి ఆయనే బాధ్యత వహిస్తాడు. ఆ విధంగా రికార్డుల్లో పాత ఓనర్​ వివరాల స్థానంలో కొత్త యజమాని వివరాలు నమోదు చేస్తారు. కరెంట్​మీటర్​ పేరు మారాలన్నా మ్యుటేషన్ ​తప్పనిసరి. హౌస్​లోన్​ ఇచ్చే బ్యాంకర్ సైతం దీన్ని ప్రయారిటీగా తీసుకుంటారు. ఆన్​లైన్​లో పాత ఓనర్​పేరు ఉన్నందున లోన్లు ఇవ్వడం లేదు.

ఎక్కడా పట్టింపులేదు

ఏప్రిల్ ​మొదట్లో సమస్య షురూ కాగా ఆ నెలాఖరున పంచాయతీ సెక్రెటరీలు సమ్మెకు వెళ్లారు. సమ్మె ముగిసిన తర్వాత ఆన్​లైన్​ను గవర్నమెంట్​ఇప్పటికీ ఓపెన్ చేయలేదు. దీని ఫలితం జిల్లాలో 6 వేల మ్యుటేషన్​లపై ఉంది. అంతకు ముందు ప్రాసెసింగ్​ దశలో ఉన్న మ్యుటేషన్​లు 1,200 ఉన్నాయి.

మున్సిపల్​ చట్టం మార్చిన సమయంలోనే..

స్టేట్​లో 2020లో కొత్త మున్సిపల్​ చట్టం తెచ్చారు. ఇదే సమయంలో  గ్రామ పంచాయతీ విధానంలోనూ విధానపరమైన మార్పులు చేశారు. అగ్రికల్చర్​ ల్యాండ్స్​ రిజిస్ట్రేషన్ బాధ్యతను రెవెన్యూ శాఖకు మార్చి, ఇండ్లు, ఇంటి జాగాల (ప్లాట్స్) రిజిస్ట్రేషన్లను సబ్​రిజిస్ట్రార్​లకు అప్పగించారు. వీటి రిజిస్ట్రేషన్లు చేసేప్పుడు ఆన్​లైన్​ మ్యుటేషన్లు కూడా చేయాలని సూచించారు. స్టాంప్​ డ్యూటీకి అదనంగా గ్రామాల్లో రూ.800, మున్సిపాలిటీల్లో రూ.3 వేల మ్యుటేషన్​ చార్జీలు వసూలు చేస్తున్నారు.

ఈ–పంచాయతీలోనే మ్యుటేషన్​లు

రిజిస్ర్టేషన్​ ఆఫీస్​ నుంచి ఆన్​లైన్​లో వెళ్లే సమాచారం ఆధారంగా ఈ–పంచాయతీలో మ్యుటేషన్లు జరుగుతాయి. టెక్నికల్​ ప్రాబ్లమ్​ఉన్నప్పుడు ఏం చేయలేం.

– జయసుధ, డీపీవో, నిజామాబాద్​