
- బువ్వ పెట్టకుండా తిడుతూ.. కొడుతుందని వృద్ధురాలి ఆవేదన
- తను రాసిచ్చిన భూమిని తిరిగి ఇప్పించాలని ఆఫీసర్లకు వేడుకోలు
మెదక్, వెలుగు: కూతురు అన్నం పెడ్తలేదు. ఇంట్లో ఉండనిస్తలేదు.. కొడుతుంది.. తనకు న్యాయం చేయాలని ఓ వృద్ధురాలి సోమవారం మెదక్ కలెక్టరేట్ ప్రజావాణిలో ఆఫీసర్లకు మొరపెట్టుకుంది. వెల్దుర్తి మండలం యశ్వంతరావు పేటకు చెందిన ఆండాళమ్మ దంపతులు ముగ్గురు కూతుళ్లను కష్టపడి చదివించారు. రెండో కూతురు నిర్మల, మూడో కూతురు సులోచన పెండ్లి చేయగా.. పెద్ద కూతురు నర్సమ్మ దివ్యాంగురాలు. కాగా ఆమెను పెండ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
దీంతో కుటుంబ సభ్యులు, బంధువులను ఒప్పించి రెండో అల్లుడికే ఇచ్చి పెండ్లి చేశారు. భర్త 8 ఏండ్ల కింద చనిపోగా ఒంటరిగా ఉంటుంది. తనకున్న మూడెకరాల పొలాన్ని పెద్దకూతురికి రాసివ్వగా.. తల్లి సంరక్షణ బాధ్యతను చూసుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు సూచించగా ఒప్పుకుంది. నర్సమ్మకు హాస్టల్ వార్డెన్ జాబ్ వచ్చిన తర్వాత తల్లి రాసిచ్చిన పొలాన్ని అమ్ముకొని నర్సాపూర్ లో ఫ్లాట్ కొనుగోలు చేసి అక్కడే ఉంటుంది. అప్పటినుంచి తనను పెద్దకూతురు పట్టించుకోవడం లేదని, ఇంట్లో ఉండనివ్వడం లేదని, కొడుతుందని ఆండాళ్లమ్మ విలపిస్తూ చెప్పింది. ఇద్దరు కూతుళ్ల వద్ద కొద్ది రోజులు ఉంటున్నట్టు తెలిపింది.
అనారోగ్యంతో బాధపడుతున్నానని దవాఖాన ఖర్చులకు కూడా పైసల్లేవని వాపోయింది. పెద్ద కూతురికి రాసిచ్చిన తన పొలాన్ని తిరిగి ఇప్పించాలని, తన సంరక్షణ చూసుకునేలా చర్యలు తీసుకోవాలని అడిషనల్కలెక్టర్ నగేష్ ను ఆండాళమ్మ వేడుకుంది. దీంతో స్పందించిన ఆయన వృద్ధురాలికి న్యాయం జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా మహిళా, శిశు, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారి హైమావతిని ఆదేశించారు.