సొంత బావ ఫోన్ ను ఎవరైనా ట్యాప్ చేస్తరా?.. పదేండ్లు ఉద్యమకారులకు తీరని అన్యాయం జరిగిందని ఫైర్

సొంత బావ ఫోన్ ను  ఎవరైనా ట్యాప్ చేస్తరా?.. పదేండ్లు ఉద్యమకారులకు  తీరని అన్యాయం జరిగిందని ఫైర్
  • ఆ వార్త వినగానే కడుపులో దేవినట్లయింది: కవిత
  • జనం బాట పట్టాక నాతో టచ్​లోకి 
  • బీఆర్ఎస్ లీడర్లు, ఉద్యమకారులు
  • ఆ పార్టీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నరు
  • అవమానం జరిగిందనే బయటికొచ్చిన 
  • గ్రానైట్ మాఫియా నుంచి సహజ వనరులను కాపాడుకోవాలని పిలుపు

కరీంనగర్, వెలుగు: ‘‘సొంత బావ ఫోన్​ను ఎవరైనా ట్యాప్ చేస్తరా? ఆ వార్త వినగానే కడుపులో దేవినట్లయింది’’ అని కేటీఆర్​ను ఉద్దేశించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. బీఆర్​ఎస్​లో తనకు అన్యాయం జరిగినా భరించానని,  కానీ అవమానం జరగడంతోనే ఆత్మగౌరవం కోసం బయటకు వచ్చానని ఆమె వెల్లడించారు. ‘‘బీఆర్ఎస్​లో చాలామంది నేతలు, ఉద్యమకారులు అసంతృప్తితో ఉన్నరు. నేను పార్టీని వీడి జనంబాట పట్టాక చాలా మంది బీఆర్ఎస్ నేతలు, ఉద్యమకారులు నాతో టచ్ లోకి వచ్చారు” అని తెలిపారు.

జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంలో కరీంనగర్ జిల్లాలో రెండో రోజు శనివారం కవిత పర్యటించారు. కరీంనగర్ లోని ఓ హోటల్ లో మేధావులతో సమావేశం నిర్వహించారు. సాయంత్రం ఫిలిగ్రీ కళాకారులతో ముచ్చటించారు. రాత్రి కరీంనగర్ టవర్ సర్కిల్ లోని మామాజీ జిలేబీ సెంటర్ ను సందర్శించారు. మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంతోపాటు చిట్ చాట్ లో కవిత మాట్లాడారు. 

రాష్ట్రంలో రాజకీయ శూన్యత

మొంథా తుఫాన్ తో పంట నష్టపోయిన రైతులను కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు పరామర్శించడం లేదని కవిత మండిపడ్డారు. వాళ్లంతా జూబ్లీహిల్స్ ఎన్నికల బిజీలో ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో కచ్చితంగా రాజకీయ శూనత్య ఉందని,  జనం బాట పూర్తయిన తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. రైతు చట్టాల గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ.. లేబర్ చట్టాల గురించి మాట్లాడటం లేదని ఆమె అన్నారు. 

‘‘రైతు చట్టాలు మారాయి. కానీ కార్మికులకు అన్యాయం చేసే చట్టాల విషయంలో మార్పు రాలేదు. ప్రధాన స్రవంతి పార్టీలు పట్టించుకోలేదు. లెఫ్ట్​ పార్టీలు ప్రయత్నించినా వారి శక్తి సరిపోలేదు. మోదీ కారణంగా కార్మికులు ఇబ్బంది పడ్తున్నరు” అని చెప్పారు.  లోకల్ బాడీ ఎన్నికల్లో ఏం చేయాలన్నది ఎన్నికల సమయంలోనేనిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు.  

నేను వాళ్ల, వీళ్ల బాణాన్ని కాదు.. తెలంగాణ ప్రజల బాణాన్ని. రాష్ట్రంలో కచ్చితంగా రాజకీయ శూన్యత ఉంది. జనం బాట పూర్తయిన తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తం. ప్రజల తరఫున పోరాడాల్సిన పార్టీలు ఆ పనిచేయటం లేదు. కొన్ని పార్టీలను నమ్ముకొని దగాపడ్డం అని ప్రజలు నాతో చెప్తున్నరు. మేం ప్రజల గొంతుకగా మారుతం. జాగృతి సాంస్కృతిక వేదిక మాత్రమే కాదు రాజకీయ వేదిక ని - కవిత అన్నారు.

దగాపడ్డ ఉద్యమకారులను అక్కున చేర్చుకుంటం

ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటి వరకు ఒక్క బీసీ గానీ, ఒక్క మహిళ గానీ ఎందుకు సీఎం కాలేకపోయారని కవిత ప్రశ్నించారు. వీలైనంత తొందరగా సామాజిక తెలంగాణ, బీసీ రిజర్వేషన్లు పూర్తి కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. వచ్చే మూడేండ్లలో చాలా ఛేంజెస్ వస్తాయని,  ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు మేలు జరుగుతుందన్నారు. 

దగాపడ్డ ఉద్యమకారులను కచ్చితంగా అక్కున చేర్చుకుంటామని తెలిపారు. పరిహారం అందని అమరవీరు ల కుటుంబాలకు పరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. పదేండ్లు తెలంగాణ ఉద్యమకారు లకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. 

స్వాతంత్ర్యం వచ్చి 79 ఏండ్లయినా, స్వరాష్ట్రం తెచ్చుకొని 12 ఏండ్లయినా పరిస్థితిలో మార్పు లేదని తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని బొమ్మలమ్మ గుట్టపై లభించిన చిన్న వల్లభుని కురిక్యాల శాసనం ద్వారానే తెలుగుకు ప్రాచీన హోదా వచ్చిందని, ఈ శాసనం ఉన్న గుట్టను కాపాడటానికి ఎంతో కష్టపడ్డామన్నారు. 

గ్రానైట్ మాఫియా నుంచి మనం సహజవనరులను కాపాడుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.  గతంలో తాను ఏమీ అనలేని బంధనాలు ఉండేవని, ఇప్పుడు తాను ఫ్రీ బర్డ్ నని చెప్పారు. గ్రానైట్ మాఫియా మీద పోరాటం చేస్తామన్నారు.