కోర్టులో నిజాలు బయటపెడతాం : కేజ్రీవాల్ భార్య

కోర్టులో నిజాలు బయటపెడతాం : కేజ్రీవాల్ భార్య

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హై కోర్టులో ఢిల్లీ లిక్కర్ కేసులో నిజాలను బయటపెడతారని ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ తెలిపారు.లిక్కర్ కేసులో డబ్బు ఎక్కడుందో కోర్టులో వెల్లడిస్తారని.. ఆధారాలు కూడా తెలియజేస్తారని చెప్పారు. బుధవారం కేజ్రీవాల్ ను కలిసిన తర్వాత ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సునితా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు సంబంధం లేదని.. ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.

లిక్కర్ కేసులో ఈడీ అధికారులు 250కిపైగా దాడులు చేశారన్నారు. డబ్బు కోసం సోదాలు చేశారని.. కాని, వారికి ఏం కనిపెట్టలేకపోయారని చెప్పారు.మార్చి 28, గురువారం కోర్టులో  కేజ్రీవాల్ అన్ని విషయాలను వెల్లడిస్తారని అన్నారు. లిక్కర్ కేసులో దేశ ప్రజలకు కేజ్రీవాల్ నిజాలను చెబుతారని తెలిపారు. రెండు రోజుల క్రితం కేజ్రీవాల్.. ఢిల్లీలో నీళ్ల సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని  మంత్రి అతిషికి లేఖ రాశారని.. అందుకు కేజ్రీవాల్ పై కేంద్ర సర్కార్ కేసు నమోదు చేసిందన్నారు. ఢిల్లీని నాశనం చేయాలనుకుంటున్నారా?.. ప్రజలు ఇబ్బందులు పడాలని కోరుకుంటున్నారా? అంటూ కేంద్రాన్ని నిలదీశారు.  కేజ్రీవాల్ జైలులో ఉన్నా.. ఆయన ఆత్మ ప్రజల్లో ఉందని చెప్పారు సునీతా కేజ్రీవాల్.

కాగా, ఈనెల 21 ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏడు రోజుల ఈడీ కస్టడీలో ఉన్నారు కేజ్రీవాల్. ఈరోజుతో కస్టడీ ముగియడంతో గురువారం ఆయనను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు ఈడీ అధికారులు.