- వైభవంగా మైనంపల్లి బర్త్ డే వేడుకలు
మెదక్, చిన్నశంకరం పేట, వెలుగు: తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవ చేస్తానని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఆయన 60 వ బర్త్ డే వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. మెదక్ పట్టణంలో ఆలయాలు, చర్చి, మసీదులలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
అనంతరం కాంగ్రెస్ నాయకులు అరుణార్తి వెంకట రమణ ఆధ్వర్యంలో ఆయన స్వగ్రామమైన చిన్నశంకరంపేట మండలం కొరవిపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడి దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మెదక్, మల్కాజిగిరి నియోజక వర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్ ల కోలాహలం మధ్య హన్మంతరావు సభ వేదిక మీద భారీ సైజ్ కేక్ కట్ చేశారు.
బ్రాహ్మణులు, పాస్టర్లు, ముస్లిం పెద్దలు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా గాయకుడు నరసింహ మైనంపల్లి హన్మంతరావు పేరు మీద రాసిన ప్రత్యేక పాటను పాడి అందరిని అలరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పరశురామ్, సర్పంచ్ ల ఫోరం జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, నాయకులు మహిపాల్ రెడ్డి, చంద్రపాల్, అరుణార్తి వెంకట రమణ, రాజేశ్, పవన్ పాల్గొన్నారు.
