ఎంబీఏ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసులో నిందితుల అరెస్టు

ఎంబీఏ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసులో నిందితుల అరెస్టు

బెంగళూరు:  మైసూరు నగర శివార్లలో ఎంబీఏ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఐదుగురు నిందితులు పట్టుపడినట్లు కర్నాటక డీజీపీ ప్రవీణ్ సూద్ ధృవీకరించారు. స్నేహితుడితో కలసి వెళ్తున్న ఎంబీఏ విద్యార్థినిని ఐదుగురు యువకులు అడ్డగించి.. ఆమె స్నేహితుడిపై దాడి చేసి అతని ఎదురుగానే విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ చేసిన ఘటన కర్నాటకలోనే కాదు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 
ఉత్తరాది రాష్ట్రానికి చెందిన బాధితురాలు మైసూరులో ఎంబీఏ చేస్తోంది. రోజు కాలేజీ నుంచి స్నేహితులతో కలసి ఇంటికి వెళ్తుండగా దుండగులు రెక్కీ చేసి మాటు వేశారు. ఈనెల 24వ తేదీన రోజు వారి మాదిరిగానే స్నేహితుడితో కలసి వెళ్తుండగా నిందితులు ఆరుగురు అడ్డగించి ఆమె బాయ్ ఫ్రెండ్ పై దాడి చేశారు. ఆపై ఆమెపై అత్యాచారం చేయడంతో స్పృహతప్పి పడిపోయింది. గాయపడిన ఆమె స్నేహితుడు, ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊహించని ఘటనతో షాక్ లో ఉండడంతో బాధితురాలి నుంచి వివరాలు సేకరించడంలో ఆలస్యం జరిగింది. 
అయినప్పటికీ కర్నాటక పోలీసులు వెంటనే స్పందించి నిందితుల కోసం వేట ప్రారంభించారు. పాత అనుమానితులను, స్థానిక, చుట్టుపక్కల ప్రాంతాల రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుని విచారించగా ఎలాంటి క్లూ లభించలేదు. దీంతో స్థానికేతరులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారన్న అనుమానాలు కలిగాయి. ఈ నేపధ్యంలో మైసూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల వారి గురించి ఆరా తీస్తుండగా తమిళనాడుకు చెందిన ఐదుగురు నిందితులు పట్టుపడ్డారు. మరో నిందితుడు పరారయ్యాడు.