"స్కూల్ బ్యాంక్ ఆఫ్​ ముల్లూర్"

"స్కూల్ బ్యాంక్ ఆఫ్​ ముల్లూర్"

బడికి వెళ్లే పిల్లలకు రోజూ కొంత పాకెట్​మనీ ఇస్తుంటారు తల్లిదండ్రులు. ఆ డబ్బుని పిల్లలు ఏరోజుకారోజు ఖర్చుపెడుతుంటారు. అలాకాకుండా ఆ డబ్బుని పొదుపు చేయడం పిల్లలకు నేర్పించాలి అనుకున్నారు ఈ టీచర్లు.  ఆటపాటలతో పాటు పిల్లల అందమైన జీవితానికి దారి వేయాలనే ఆలోచనతో స్కూల్లోనే ఒక బ్యాంక్ ఏర్పాటు చేశారు. మైసూరు జిల్లాలోని ముల్లూర్​లో ఉన్న ఈ బ్యాంక్ పేరు ‘స్కూల్ బ్యాంక్ ఆఫ్​ ముల్లూర్’. పిల్లలు నడిపిస్తున్న ఈ బ్యాంక్ విశేషాలివి...

చిన్న వయసు నుంచే డబ్బులు పొదుపు చేయడం నేర్పించాలని ఈ బ్యాంక్ ఏర్పాటు చేశారు స్కూల్ టీచర్లు.  ఈ లోయర్ ప్రైమరీ స్కూల్లో 37 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ప్రతి స్టూడెంట్​కు అకౌంట్ నెంబర్ ఉంటుంది. పిల్లల పేరు, వాళ్ల అకౌంట్ నెంబర్ రాసి ఉన్న బోర్డు కూడా ఏర్పాటు చేశారు. పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇన్సెంటివ్స్​ కూడా ఇస్తారు. ఉదాహరణకు.. వంద రూపాయలు డిపాజిట్ చేస్తే పెన్సిల్, రెండొందలు చేస్తే పెన్ను, మూడొందలు జమ చేస్తే నోట్ బుక్  బహుమతిగా ఇస్తారు.  ఐదొందల రూపాయలు డిపాజిట్ చేసినవాళ్లకు ఐదు శాతం వడ్డీ వస్తుంది. అకౌంట్​లో వెయ్యి రూపాయల వరకు జమ అవ్వగానే వాళ్ల  ఆన్​లైన్ అకౌంట్​కి ఆ డబ్బుని పంపిస్తారు. అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవాలి అనుకుంటే విత్​డ్రాయల్ చలాన్ నింపాలి. అచ్చం బ్యాంక్​లో జరిగినట్టే  ఈ స్కూల్​ బ్యాంక్​లో  లావాదేవీలు నిర్వహిస్తున్నారు ఇక్కడి పిల్లలు. 

ప్రతి ఒక్కరికీ లాకర్

‘‘బ్యాంకులలో ఉన్నట్టే  మా స్కూల్ బ్యాంక్​లో  డబ్బులు దాచుకునే ప్రతి స్టూడెంట్​కి ఒక లాకర్ ఉంటుంది. చేతితో తయారుచేసిన పాస్​బుక్, చెక్ బుక్ ఇస్తాం. బ్యాంక్ మేనేజర్, అకౌంటెంట్, క్యాషియర్​గా రోజూ కొందరు పిల్లలకు బ్యాంక్ పని అప్పగిస్తాం” అని వివరించాడు సతీష్​ అనే టీచర్. 

చిన్న చిన్న ఖర్చులకి...

‘‘ఇంతకుమందు పాకెట్​ మనీ మొత్తం జంక్​​ఫుడ్ తినేందుకు ఖర్చుచేసేవాడిని. కానీ, ఇప్పుడు అలా చేయడం లేదు. అమ్మానాన్న ఇచ్చిన డబ్బుని మా స్కూల్ బ్యాంక్​లో దాచుకుంటున్నా. నోట్స్, ఎగ్జామ్ ప్యాడ్.. ఇలా చిన్న చిన్న ఖర్చులకి ఆ డబ్బుని వాడుతున్నా” అని చెప్పాడు ఐదో క్లాస్ చదువుతున్న శరద్ నవ్య అనే స్టూడెంట్.