
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ కర్నాటక పర్యటనలో తన హెలికాప్టర్ లో అనధికారికంగా పెద్ద బాక్స్ తరలించారని, అందులో ఏముందో ఈసీ విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. బాక్స్ మిస్టరీని ఛేదించాలంటూ కర్నాటక పీసీసీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ను కేపీసీసీ ప్రెసిడెంట్ దినేశ్ గుండూరావు శనివారం మీడియాకు విడుదల చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నాటకలోని చిత్రదుర్గలో బీజేపీ సభకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ లో ఉన్న ఓ భారీబ్లాక్ బాక్స్‌ను సిబ్బంది కిందికి దించి కార్ లో తరలించారు. ఈ బాక్స్ ఎక్కడిది, అందులో ఏముంది, దానిని ఎక్కడికి పంపించారనే ప్రశ్నలకు ఎవరి వద్దా జవాబు లేదు . చాపర్ లో బాక్స్ తీసుకెళుతున్న వివరాలు కూడా లేవు. ఈ అనుమానాస్పద పెట్టెలో ఏముందనేది తెలుసుకునేందుకు విచారణ జరిపించాలని కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ఈసీని కోరారు. ఎన్నికల ప్రచారానికి వెళుతున్నపుడు కేం ద్రమంత్రులు, ప్రధాని సహా ప్రజాప్రతినిధుల వాహనాలను తనిఖీ చేసే అధికారం ఈసీకి ఉందని గుర్తుచేశారు. అయితే, ప్రధాని వాహనాల విషయంలో ఈ రూల్ అమలు కావడంలేదని శర్మ విమర్శించారు. దేశ ప్రజల కోసం, ప్రధాని పదవి గౌరవాన్ని కాపాడటం కోసం సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ఆనంద్ శర్మ చెప్పారు.