Pawan Kalyan : 'హరి హర వీరమల్లు'కు కన్నడ సెగ.. బ్యానర్ కన్నడలో లేదని చించేశారు !

Pawan Kalyan : 'హరి హర వీరమల్లు'కు కన్నడ సెగ.. బ్యానర్ కన్నడలో లేదని చించేశారు !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'హరిహర వీరమల్లు' ( Hari Hara Veera Mallu ) సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, కర్ణాటకలో సినిమాకు సంబంధించిన ఒక బ్యానర్‌పై జరిగిన దాడి చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు(Bangalore ) లోని ఒక థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన సినిమా బ్యానర్‌ను కొందరు వ్యక్తులు చించివేసి, చిత్ర బృందానికి, పవన్ అభిమానులకు షాక్ ఇచ్చారు.

ఈ సంఘటనకు గల ప్రధాన కారణం, బ్యానర్‌పై కన్నడ భాషలో చిత్ర టైటిల్ లేకపోవడం. బెంగళూరులోని థియేటర్లలో ప్రదర్శించే తెలుగు, తమిళ చిత్రాల బ్యానర్లు, పోస్టర్లపై తప్పనిసరిగా కన్నడలో కూడా చిత్ర టైటిల్ ఉండాలనే నిబంధన ఉంది. స్థానిక భాషకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ నిబంధనను కర్ణాటకలోని కన్నడ సంఘాలు పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. 'హరిహర వీరమల్లు' బ్యానర్‌పై తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే టైటిల్ ఉండటంతో, కన్నడ భాషకు అగౌరవం జరిగిందని భావించిన కొందరు వ్యక్తులు బ్యానర్‌ను ధ్వంసం చేశారు.

 

ఈ సంఘటనపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా పవన్ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ సంఘటన నిరాశ కలిగించింది. అయితే, కన్నడ సంఘాలు తమ భాషకు ఇచ్చే ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలని, భవిష్యత్తులో ఇతర భాషా చిత్రాల నిర్మాతలు కర్ణాటకలో సినిమాను విడుదల చేసేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

►ALSO READ | అంబటి రాంబాబు పవన్ ఫ్యాన్ గా మారారా? 'హరిహర వీరమల్లు' సూపర్ డూపర్ హిట్టై.. కనక వర్షం కురవాలంటూ పోస్ట్!

అయితే కర్ణాటకలో చోటుచేసుకున్న ఘటనపై 'హరిహర వీరమల్లు' చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరి కొన్ని గంటల్లో సినిమా విడుదలవుతున్న సమయంలో జరిగిన ఈ సంఘటన అభిమానులను కాస్త నిరాశ పరిచింది.  తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం, కర్ణాటకలో మాత్రం చిన్నపాటి అడ్డంకిని ఎదుర్కొంది.  

 "హరిహర వీర మల్లు" ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక వీరుడి పాత్రలో నటిస్తున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా జూలై 24న ఈ మూవీ విడుదలవుతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, నోరా ఫతేహి, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. క్రిష్ జాగర్లమూడి, ఎఎం జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి  ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరించారు. ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు.  భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.  మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డు సృష్టిస్తుందో చూడాలి మరి.