అంబటి రాంబాబు పవన్ ఫ్యాన్ గా మారారా? 'హరిహర వీరమల్లు' సూపర్ డూపర్ హిట్టై.. కనక వర్షం కురవాలంటూ పోస్ట్!

అంబటి రాంబాబు పవన్ ఫ్యాన్ గా మారారా? 'హరిహర వీరమల్లు' సూపర్ డూపర్ హిట్టై.. కనక వర్షం కురవాలంటూ పోస్ట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కథానాయకుడిగా నటించిన 'హరిహర వీరమల్లు' (  Hari Hara Veera Mallu ) చిత్రం జూలై 24న రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.  దాదాపు మూడేళ్ల తర్వాత వస్తున్న పవన్ సినిమా కావడంతో అభిమానులు ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు.  మరి కొన్ని గంటల్లో విడుదలకు సిద్ధం కావడంతో  ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్లో టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి.  ఈ సమయంలో వైసీపీ నేత పెట్టిన పోస్ట్ ఇప్పడు చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

సాధారణంగా రాజకీయ ప్రత్యర్థుల మధ్య తరచుగా మాటల యుద్ధం, విమర్శలు ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా పవన్ కళ్యాణ్, వైసీపీ నేతల మధ్య తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలు నడుస్తుంటాయి. ఇలాంటి సమయంలో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu ) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటిస్తున్న "హరిహర వీర మల్లు" సినిమాపై చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

అంబటి రాంబాబు  తన సోషల్ మీడియా ఖాతా X లో "పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీర మల్లు' సూపర్ డూపర్ హిట్టై కనక వర్షం కురవాలని కోరుకుంటున్నాను!" అని పోస్ట్ చేశారు.  ఈ పోస్ట్ ను పవన్ కళ్యాణ్ , నాగబాబుని ట్యాగ్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలతో పాటు సినీ అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ఇది కేవలం ఒక సినిమాకు శుభాకాంక్షలు తెలపడమేనా లేక దీని వెనుక మరేదైనా రాజకీయ వ్యూహం ఉందా అనే చర్చ మొదలైంది.

 

అయితే అంబటి రాంబాబు వ్యాఖ్యలపై సోషల్ మీడియలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది స్పోర్టివ్‌గా తీసుకున్న వ్యాఖ్యలుగా భావిస్తే, మరికొందరు దీనిని పవన్ కళ్యాణ్‌ను పరోక్షంగా ఎగతాళి చేయడంగా చూస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రసంగాల్లో తరచుగా సినిమాలు, తన వ్యక్తిగత విషయాలపై వైసీపీ నేతలు చేసే విమర్శలను ప్రస్తావిస్తుంటారు. ఇలాంటి నేపథ్యంలో అంబటి రాంబాబు  నిజంగానే శుభాకాంక్షలు తెలిపారా లేదా వ్యంగ్యంగా ఈ వ్యాఖ్యలు చేశారా అనేది స్పష్టం కావాల్సి ఉంది. ఏదేమైనా ఈ పోస్ట్ మాత్రం రాజకీయంగా, సినిమా పరంగా కొంత చర్చకు దారితీసింది.

క్రిష్ జాగర్లమూడి, ఎఎం జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన "హరిహర వీర మల్లు" ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక వీరుడి పాత్రలో నటిస్తున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా జూలై 24న ఈ మూవీ విడుదలవుతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, నోరా ఫతేహి కథానాయికలుగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరించగా, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు.  భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.  మరి బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టిస్తుందో లేదో చూడాలి మరి.