బావిలో కనిపించిన అస్తి పంజరం.. వంద అడుగుల లోతులో పుర్రె

బావిలో కనిపించిన అస్తి పంజరం.. వంద అడుగుల లోతులో పుర్రె
  • కరీంనగర్​ జ్యోతిష్మతి కాలేజీలో  మార్చి 1న అదృశ్యమైన డిప్లొమా స్టూడెంట్​ అభిలాష్​
  •    దుస్తుల ద్వారా అతడిదే కావచ్చని అనుమానిస్తున్న పోలీసులు 
  • ఫోరెన్సిక్​ ల్యాబ్​కు శాంపిల్స్​రిపోర్ట్​ వస్తేనే వాస్తవం బయటకు 

తిమ్మాపూర్, వెలుగు : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఓ వ్యవసాయ బావిలో ఆరు రోజుల కింద అస్తి పంజరం..సోమవారం పుర్రె బయటపడగా..అది మార్చి 1న కాలేజీ నుంచి అదృశ్యమైన ఓ విద్యార్థిదేననన్న అనుమానాలు కలుగుతున్నాయి.  దుస్తుల ఆధారంగా ఈ నిర్ణయానికి వస్తున్నా ఫోరెన్సిక్​ రిపోర్ట్​ వస్తే కానీ ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దామెరకుంటకు చెందిన ఎనగంటి అభిలాష్​(20) జ్యోతిష్మతి కాలేజీలో డిప్లొమా స్టూడెంట్. మార్చి1న ఫ్రెండ్​ బర్త్​డే కోసం స్నేహితులతో కలిసి కరీంనగర్​ వెళ్లాడు. సెలబ్రేషన్స్​తర్వాత అభిలాష్​ తప్ప మిగతా వారు హాస్టల్​కు వచ్చారు. కొద్దిసేపటికి తాను కాలేజీ గేటు దగ్గర ఉన్నానని, వచ్చి తీసుకుపోవాలని అభిలాష్​ ఓ ఫ్రెండ్​కు ఫోన్​ చేశాడు. గేటు దగ్గరకు రాగా కనిపించలేదు. ఫోన్​ చేస్తే స్విచ్ఛాఫ్ ​రాగా, వేరే ఫ్రెండ్​దగ్గరకు వెళ్లి ఉంటాడని భావించారు. తెల్లారినా ఫోన్ ​ఆన్​కాకపోవడం, ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రులకు మేనేజ్​మెంట్​ సమాచారమిచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి అభిలాష్ కోసం వెతుకుతున్నారు. 

భార్యభర్తల గొడవతో బయటకు..

మార్చి 27న అల్గునూరుకు చెందిన భార్యాభర్తలు ఇంట్లో గొడవపడ్డారు. ఆత్మహత్య చేసుకుంటానని ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తన భార్య కనిపించడం లేదని, బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిందని పోలీసులకు భర్త కంప్లయింట్​ఇవ్వడంతో పోలీసులు చుట్టుపక్కల వ్యవసాయ బావుల్లో వెతకడం మొదలుపెట్టారు. జ్యోతిష్మతి ఇంజినీరింగ్​కాలేజీకి కిలోమీటర్​ దూరంలోని ఓ వ్యవసాయ బావిలో వెతుకుతుండగా తల లేని అస్తి పంజరం దొరికింది. దీంతో అప్పటికే మిస్సింగ్​ కేసు నమోదై ఉండడం, మృతుడు వేసుకున్న బట్టల ఆధారంగా అది అభిలాష్​ డెడ్​బాడీ అని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తల లేకపోవడంతో సైంటిఫిక్​గా అది అభిలాష్​ డెడ్​బాడీ అని గుర్తించడానికి డీఎన్ఏ పరీక్ష అనివార్యమైంది. తల కూడా దొరక్కపోవడం పోలీసులకు సవాల్​గా మారింది. 

పుర్రె కోసం శ్రమించిన పోలీసులు 

అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు పుర్రె కోసం తీవ్రంగా గాలించారు. సీఐ స్వామి, ఎస్సై చేరాలు వివిధ కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. అస్తి పంజరానికి తల లేకపోవడంతో బావి లోపల పడిపోయి ఉంటుందన్న అనుమానంతో రెండు రోజులు కష్టపడి బావిలో నీటిని పూర్తిగా ఖాళీ చేశారు. దీంతో వంద అడుగుల లోతులో పుర్రె కనిపించింది.  పుర్రె, అస్తి పంజరం శాంపిల్స్​ తీసుకున్న ఫోరెన్సిక్​సిబ్బంది హైదరాబాద్​ ల్యాబ్​కు పంపించారు. ఆ రిపోర్టు ఆధారంగా మృతుడు అభిలాషా కాదా అనేది నిర్ధారణ అవుతుందని, అలాగే హత్యా ఆత్మహత్యా అన్నది కూడా తేలుతుందని పోలీసులు చెబుతున్నారు.