మూడు వయసులు.. మూడు గెటప్పులతో మెప్పించిన చైతు

మూడు వయసులు.. మూడు గెటప్పులతో మెప్పించిన చైతు

నటీనటులు: నాగచైతన్య, రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్, సుశాంత్ రెడ్డి, ప్రకాష్ రాజ్, ఈశ్వరీరావు తదితరులు
సంగీతం: తమన్
కథ: బీవీఎస్ రవి
నిర్మాణ: దిల్‌ రాజు, శిరీష్
స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్: విక్రమ్ కె కుమార్

గతంలో నాగచైతన్యతో ‘మనం’ లాంటి మెమొరబుల్ మూవీని తీసిన విక్రమ్ కుమార్.. తనతో మరోసారి సినిమా తీస్తున్నాడనే వార్తే అక్కినేని అభిమానుల్లో జోష్‌ని నింపింది. పైగా చైతు కెరీర్‌‌లోని బెస్ట్ మూవీస్‌లో ఒకటైన ‘ప్రేమమ్‌’తో దీన్ని పోల్చడంతో అంచనాలు మరింత పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘థాంక్యూ’ అందుకుందా ? లేదా ? పరిశీలిద్దాం.

కథ
అభిరామ్ (చైతు) ఇండియాలో చదువుకుని ఉద్యోగం కోసం అమెరికా వెళ్తాడు. ఓవైపు జాబ్ కోసం ట్రై చేస్తూనే ఓ మెడికల్ యాప్ తయారు చేస్తాడు. అది ఇన్వెస్టర్ల దృష్టిని ఆకట్టుకోవడంతో దాన్నే వ్యాపారంగా మలచుకుంటాడు. చాలా గొప్ప స్థాయికి చేరుకుంటాడు. అయితే ఇదంతా తన గొప్పదనమనే ఫీలింగ్‌తో అహంభావం పెరుగుతుంది. ఎలా పడితే అలా బిహేవ్ చేస్తాడు. మొదట్నుంచీ తనకి తోడుగా ఉన్న ప్రియ (రాశి)ని కూడా నిర్లక్ష్యం చేస్తాడు. తన సాయం కోసం వచ్చిన రావు (ప్రకాష్‌ రాజ్‌)ని పట్టించుకోవడంతో అతని ప్రాణాలే పోతాయి. దాంతో ప్రియ అతణ్ని వదిలేసి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అభిలో అంతర్మథనం మొదలవుతుంది. అప్పుడతను ఏం చేశాడు, తనని తాను మార్చుకున్నాడా, అందరికీ మళ్లీ దగ్గరవగలిగాడా అనేది మిగతా కథ. 

ఎలా ఉందంటే..
ఇది ఒక మనిషి లైఫ్ జర్నీ. జీవితంలోని పలు దశలు, అందులో జరిగిన సంఘటనలు, ఎదురైన మనుషులు, బంధాలు, స్నేహాలు.. అన్నీ కలిసిన కథ. ఇలాంటి స్టోరీలు, సినిమాలు మనకి కొత్త కాదు. గతంలో నాగచైతన్య చేసిన ‘ప్రేమమ్’ కూడా ఇలాంటి సినిమానే. అందుకే బహుశా దానితో పోల్చి ఉండవచ్చు. కానీ అందులో ఉన్న  ఫ్రెష్‌ ఫీల్ కానీ, ఇంటెన్సిటీ కానీ ఇందులో కోరుకుంటే డిజప్పాయింట్‌మెంట్ తప్పదు. బీవీఎస్ రవి మనసులో మెదిలిన ఓ చిన్న లైన్‌కి రెండున్నర గంటల ట్రీట్‌మెంట్ ఇచ్చే బాధ్యతను తలకెత్తుకున్నాడు దర్శకుడు. కథ బాగానే మొదలెట్టాడు. ఇన్‌వాల్వ్ కూడా చేయగలిగాడు. కానీ ఆ తర్వాత ఆయన కన్‌ఫ్యూజ్ అయ్యాడో లేక ఆయన థాట్స్ అర్థం కాక మనం కన్‌ఫ్యూజ్ అవుతున్నామో తెలియని అయోమయంలో పడతాం సినిమా చూసినప్పుడు. ఇలాంటి కథలకు కచ్చితంగా ఫీల్ అనేది ఇంపార్టెంట్. అది మిస్సయితే కనెక్ట్ అవడం చాలా కష్టం. ప్రతి మనిషి జీవితంలోనూ ఎంతోమంది వ్యక్తులు తారసపడతారు. ఎన్నో సందర్భాల్లో మనకి సాయపడతారు. వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్పాలి అనే పాయింట్ కరెక్టే. కానీ థ్యాంక్స్ మాత్రమే చెబితే సరిపోతుందా, కృతజ్ఞత చెల్లించాల్సిన అవసరం లేదా అనే డౌట్ కూడా ఓ సందర్భంలో మనకి కలుగుతుంది. 

మరో విషయం ఏమిటంటే.. సినిమా చివరి వరకు ప్రేక్షకుడు కూర్చోవాలి అంటే కాస్తయినా సస్పెన్స్ ఉండాలి. ఇంకా ఏదో జరగబోతోంది అనే ఆసక్తి కలగాలి. కానీ ఈ సినిమా ఏమిటనేది మనకి మొదటి కొన్ని సీన్స్తోనే అర్థమైపోవడం వల్ల మరింత లోతుగా వెళ్లడానికి, చివరి వరకు చూడటానికి అంత ఆసక్తి చూపించం. అలా అని మొత్తం బాలేదా అంటే అవుననడానికీ లేదు. విక్రమ్ మార్క్ కొన్ని సీన్స్లో కనిపించింది. హీరో జర్నీని ఆది నుంచి చూపించే విధానం మనల్ని మెప్పిస్తుంది. ముఖ్యంగా అతని ఫస్ట్ లవ్‌ని చాలా బాగా చూపించారు. మెచ్యూర్డ్ రైటింగ్, అంతకంటే మెచ్యూర్డ్ టేకింగ్ మన మనసుకు హత్తుకుంటాయి. అదే ఇంటెన్సిటీ అన్ని సన్నివేశాల్లోనూ ఉండి ఉంటే ఈ సినిమా మరో స్థాయిలో ఉండేది. ముఖ్యంగా సెకెండాఫ్ మరీ ఎక్కువ డ్రాగ్ చేసినట్టు అనిపించడం, హాకీ ఎలిమెంట్ అంత కొత్తగా అనిపించకపోవడం వల్ల ఫస్టాఫ్‌లో కలిగిన కాస్త ఫీల్ కూడా మనల్ని వదిలి వెళ్లిపోతుంది. కాలేజ్ ఎపిసోడ్‌ మరీ నీరసం తెప్పిస్తుంది. ఇక క్లైమాక్స్ అయితే సడెన్‌గా ఊడి పడినట్టే ఉంటుంది. అంతవరకు ఒక ఫీల్, అది వచ్చాక మరో ఫీల్. అన్నీ కలిసి ఓ మిక్స్డ్ ఫీలింగ్ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. 

ప్లస్సులూ మైనస్సులూ..
ఈ సినిమాకి ప్లస్ కచ్చితంగా నాగచైతన్యే. మూడు వయసులు.. మూడు రకాల గెటప్పులు.. మూడు విధాలైన పర్‌‌ఫార్మెన్స్తో ద బెస్ట్ అనిపిస్తాడు. కొన్ని సీన్స్లో అతని నటన ఎంతో మెచ్యూర్డ్గా అనిపిస్తుంది. తనలో ఎంత గొప్ప యాక్టర్ ఉన్నాడో కదా అని ఇంప్రెస్ అయిపోయేలా చేస్తుంది. రాశీ ఖన్నా కూడా చక్కగా పర్‌‌ఫార్మెన్స్ చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్లో వీళ్లిద్దరూ పోటీపడి నటించారు. మాళవిక తన పాత్రకి న్యాయం చేసింది. అవిక పాత్రకి అంత స్కోప్ లేకపోయినా ఎప్పటిలానే మంచి నటన కనబరిచింది. తమన్‌ పాటలు అంత ఇంప్రెసివ్‌గా లేకపోయినా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ఆహ్లాదంగా సాగింది. కథలో ఫీల్ మిస్సయినా అతని మ్యూజిక్‌లో మాత్రం ఆ ఫీల్ కనిపిస్తుంది. ఇక అన్నిటికంటే పెద్ద ప్లస్.. సినిమాటోగ్రఫీ. పీసీ శ్రీరామ్ మరోసారి మ్యాజిక్ చేశారు. కథ ఆయనకి ఎంత బాగా పట్టేసిందో ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపించింది. ఇక దిల్ రాజు సినిమాలో ఉండే టెక్నికల్ క్వాలిటీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.

ఇక మైనస్‌ల విషయానికొస్తే మొదటగా చెప్పుకోవాల్సింది నేరేషన్ గురించే. ఎంత చిన్న లైన్ అయినా మంచి ట్రీట్‌మెంట్ ఇస్తే సూపర్ డూపర్ హిట్టు కొట్టే చాన్సెస్ ఫుల్లుగా ఉంటాయని ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది. మనం, 24 లాంటి ఇంటెలిజెంట్ స్క్రీన్‌ ప్లే ఇచ్చిన విక్రమ్ కుమార్ ఇంత సింపుల్ స్టోరీకి కూడా ఎందుకింత డల్ నేరేషన్ ఇచ్చారా అని ప్రేక్షకులు ఫీలయ్యేలా సాగింది కథనం. రొటీన్ సీన్స్, అవసరం లేదనిపించే డ్రామా ఆయన మార్క్ కానే కాదు. ఆయన నుంచి ఆశించేది ఇదైతే ఎంతమాత్రం కాదు. 

కొసమెరుపు: థాంక్యూ.. మనస్ఫూర్తిగా చెప్పలేం