
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య వ్యక్తిగత జీవితం ఎప్పుడూ అభిమానులకు ఆసక్తికరమే. ముఖ్యంగా నటి శోభిత ధూళిపాళతో ఆయన ప్రేమ, పెళ్లి గురించి తెలుసుకోవాలని అందరూ ఉత్సుకతగా ఉంటారు. ఈ మోస్ట్ లవబుల్ కపుల్ గురించి, వారి సరదా పోరాటాల గురించి చైతన్య ఇటీవల ఒక ప్రముఖ టాక్ షోలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒక పాట కారణంగా శోభిత తనపై అలిగి కొంతకాలం పాటు మాట్లాడటమే మానేసిందన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
'బుజ్జితల్లి' అలక వెనుక కథ!
లేటెస్ట్ గా నటుడు జగపతి బాబు హోస్ట్ చేస్తున్న ZEE5 టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్మురా'లో నాగచైతన్య పాల్గొని తన జీవితంలో చోటు చేసుకున్న ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా.. తన కెరీర్‌లో రూ.100 కోట్ల వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన 'తండేల్' సినిమాలోని ఒక పాట కారణంగా భార్య తనపై అలిగిన సంఘటనను సరదాగా గుర్తుచేసుకున్నారు. 'తండేల్' సినిమా ఫిబ్రవరి 7న విడుదలై ఘన విజయం సాధించడంలో, సాయి పల్లవితో చైతన్య చేసిన 'బుజ్జితల్లి' పాట ముఖ్య పాత్ర పోషించింది. ఈ పాట విడుదలైన నాటి నుంచి ట్రెండింగ్‌లో ఉంటూ.. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే, ఈ పాటే చైతన్యకు కాస్త ఇబ్బంది తెచ్చిపెట్టిందని చెప్పారు .
నేను శోభితను ప్రేమగా 'బుజ్జితల్లి' అని పిలుస్తాను. అది మా ఇద్దరి మధ్య ఉన్న ప్రత్యేకమైన ముద్దుపేరు. అయితే, 'తండేల్' సినిమాలో ఆ పేరును సాయి పల్లవి పాత్రకు పెట్టడం, ఆ పేరుతోనే పాట రావడంతో శోభిత అప్‌సెట్ అయ్యింది. నేనే డైరెక్టర్ చందూ మొండేటికి ఆ పేరును సూచించానని ఆమె గట్టిగా నమ్మింది. కోపంతో కొన్నాళ్లపాటు నాతో సరిగా మాట్లాడలేదు అని నవ్వుతూ చెప్పారు నాగ చైతన్య. నేనెందుకు అలా చేస్తాను? అంటూ ఆ ఫన్నీ మిస్‌కమ్యూనికేషన్‌ను పంచుకున్నారు. నిజానికి, ఈ పాట ప్రియురాలికి దూరమైన ప్రియుడు ఆమెను బుజ్జగించే భావోద్వేగంతో సాగుతుంది.
ఇన్స్టాగ్రామ్ లవ్ స్టోరీ!
ఈ సందర్భంగా చైతన్య-శోభితల ప్రేమాయణం ఎలా మొదలైందో కూడా వివరించారు. ఈ లవ్‌బర్డ్స్ కలిసింది ఎక్కడో కాదు.. ఇన్‌స్టాగ్రామ్‌లోనే అని చెప్పుకొచ్చారు. మా జీవిత భాగస్వామిని నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కలుస్తానని అస్సలు ఊహించలేదు. ఒక రోజు, నేను నా క్లౌడ్ కిచెన్ 'షోయు' గురించి ఒక పోస్ట్ పెట్టాను. దానికి శోభిత ఒక ఎమోజీతో కామెంట్ చేసింది. అక్కడి నుంచి మా చాటింగ్ మొదలైంది. కొద్ది రోజులకే మేమిద్దరం కలిశాం అని చైతన్య గుర్తుచేసుకున్నారు. దాదాపు రెండేళ్లు డేటింగ్ చేసిన ఈ జంట, 2024 డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సన్నిహితుల మధ్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ ప్రపంచంలో గొడవ పడని జంటలు ఉండవు. ఇద్దరి మధ్య గొడవే జరగలేదంటే.. వారి రిలేషన్‌షిప్ నిజమైనది కాదని అర్థం. శోభిత నా బిగ్గెస్ట్ స్ట్రెంత్ , సపోర్ట్ అంటూ భార్యపై తనకున్న ప్రేమను చాటుకున్నారు చైతు.
'తండేల్' విజయం తర్వాత, నాగ చైతన్య ప్రస్తుతం 'విరూపాక్ష' ఫేమ్ దర్శకుడు కార్తీక్ దండుతో తన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఒక మిథికల్ థ్రిల్లర్ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాకు 'కాంతార' ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా, ఇది వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. చైతన్య పంచుకున్న ఈ వ్యక్తిగత విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.