నాగాల్యాండ్, మేఘాలయలలో ఫిబ్రవరి27న పోలింగ్

నాగాల్యాండ్, మేఘాలయలలో ఫిబ్రవరి27న పోలింగ్

ఈ శాన్య ప్రాంతంలో రెండు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు సమీపిస్తున్నాయి. త్రిపురలో ఫిబ్రవరి 16న పోలింగ్ పూర్తయింది. నాగాల్యాండ్, మేఘాలయలలో ఫిబ్రవరి27న పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మేఘాలయలో 21.1 లక్షల మంది, నాగాల్యాండ్ లో13.1 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. త్రిపురలో 2018లో జరిగిన ఎన్నికల్లో గెలిచి బీజేపీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. నాగాల్యాండ్, మేఘాలయల్లో ప్రాంతీయ పార్టీలతో కలసి అధికారాన్ని పంచుకుంటూ జూనియర్ భాగస్వామిగా ఉంది. ఈ ఏడాది 9 రాష్ట్రాల్లో జరుగనున్న అన్ని ఎన్నికల్లోనూ గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. సాయుధ దళాల(ప్రత్యేక అధికారాల) చట్టాన్ని ఈశాన్యంలోని కొన్ని ప్రాంతాల్లో గత ఏడాది ఎత్తివేశారు. దీని నుంచి ప్రయోజనం పొందాలని బీజేపీ చూస్తోంది. తమను ఆలంబనగా చేసుకుని బీజేపీ విస్తరిస్తూ వస్తోందని ఈశాన్య ప్రాంతంలోని పార్టీలు భావిస్తున్నాయి. 

మేఘాలయ

మేఘాలయలో ఎన్​పీపీ-, బీజేపీ మధ్య సంబంధాల్లో  కూడా ఘర్షణలు తలెత్తాయి. మేఘాలయలో 60 సీట్లున్నాయి. మేఘాలయ ముఖ్యమంత్రి కోనరాడ్ సంగ్మా ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఏడాది ముందే ప్రకటించారు. దానికి తగ్గట్లుగానే 58 సీట్లలో అభ్యర్థులను నిలబెట్టారు. ఆయన 2016లో నేషనల్ పీపుల్స్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. మేఘాలయకు 13వ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తండ్రి దివంగత పీఏ సంగ్మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, లోక్ సభ స్పీకర్ గా పనిచేశారు. బొగ్గు గనుల తవ్వకాలు మేఘాలయలో కీలక అంశంగా మారింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ 2014లో వీటిని నిషేధించింది. స్థానిక గిరిజనులే మేఘాలయలోని భూముల యజమానులని, భూగర్భంలోని ఖనిజాలు కూడా వారికే చెందుతాయంటూ సుప్రీం కోర్టు  2019లో ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే, బొగ్గు గనుల తవ్వకాలు శాస్త్రీయంగా సాగాలని కోర్టు పేర్కొంది. బొగ్గు గనుల అక్రమ తవ్వకాలను అరికట్టడంలో ఎన్​పీపీ విఫలమైందంటూ టీఎంసీ నాయకుడు అభిషేక్ బెనర్జీ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ సొమ్ము గువాహటి, ఢిల్లీలోని బీజేపీ నాయకుల జేబుల్లోకి వెళుతోందంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మేఘాలయలోని ఇంటింటికీ తాగునీరు అందించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ. 24,000 కోట్లు సమకూర్చిందని, కానీ, రాష్ట్ర ప్రభుత్వం వాటిని స్వాహా చేసిందని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆరోపించారు. రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక ఏడాది క్రితం వరకు బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. కేంద్రం 2.5 లక్షల గృహాలను కేటాయించిన బీజేపీకి ఖ్యాతి దక్కుతుందనే భయంతో ముఖ్యమంత్రిగా సంగ్మా వాటికి మోకాలడ్డారని కూడా అమిత్​షా ఎన్నికల ప్రచారంలో విమర్శలు గుప్పించారు. మరో మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా కూడా కోనరాడ్ కు ఏమీ తీసిపోలేదని, వారిద్దరూ వారి కుటుంబాల బాగుకు మాత్రమే పనిచేశారని, రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలను కాలరాశారని అమిత్ షా పేర్కొన్నారు. మేఘాలయలోని 60 శాసనసభా స్థానాలకు బీజేపీ పోటీ చేస్తోంది. ఆ విధంగా ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సుముఖంగా ఉన్నామనే సంకేతాన్ని ఇస్తోంది. అయితే, ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ఈ రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి తెచ్చే యోచనను కోరాడ్ సంగ్మా వ్యతిరేకిస్తున్నారు. పొరుగునున్న అస్సాంలో బీజేపీయే అధికారంలో ఉంది. తమ పార్టీ మేఘాలయలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోందని అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వశర్మ అరమరికలు లేకుండా ప్రకటించారు. కోనరాడ్ సంగ్మా కోటలో పాగా వేయాలని మరోపక్క మమతా బెనర్జీ కూడా కోరికతో ఉన్నారు. మేఘాలయలో 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 21 సీట్లు గెలుచుకుంది. కానీ, వారిలో అత్యధికులను మాజీ ముఖ్యమంత్రి ముకుల్ శర్మ తన వెంట టీఎంసీలోకి తీసుకుపోయారు. 

నాగాల్యాండ్​

నాగాల్యాండ్ లో నేషనలిస్ట్ డెమొక్రాటిక్ ప్రోగ్రసీవ్ పార్టీ(ఎన్డీపీపీ)తో బీజేపీ సంబంధాలు పటిష్టంగానే ఉన్నాయి. ఎన్డీపీపీ 40 సీట్లకు, బీజేపీ 20 సీట్లకు పోటీ చేస్తున్నాయి. నాగాల్యాండ్ లో బీజేపీ తిరిగి అధికారానికి వస్తుందని హెచ్. తొవిహొతొ అయేమి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. నాగాల్యాండ్ తూర్పు ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. ఎన్నికల ప్రణాళికలో నాగాల్యాండ్ కు ఫైనాన్షియల్ ప్యాకేజీని కూడా వాగ్దానం చేసింది. నాగాల్యాండ్ సర్వతోముఖాభివృద్దికి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెబుతూ వచ్చారు. హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో మాదిరి ఇక్కడ కూడా పాత పెన్షన్ పథకాన్ని అమలు చేస్తామని ఆయన వాగ్దానం చేశారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) కూడా పోటీలో ఉంది. టీఆర్​ జెలియాంగ్ నేతృత్వంలో ఈ పార్టీ 2018 ఎన్నికల్లో 26 సీట్లు గెలుచుకుంది. జెలియాంగ్ నాగాల్యాండ్ కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.  నాగాల్యాండ్, త్రిపురల్లో  2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. మొత్తానికి, ఈశాన్య ప్రాంతంలో ప్రాంతీయ పార్టీల హవాయే ఎక్కువ. బీజేపీ, కాంగ్రెస్ లు వాటిని ఆలంబనగా చేసుకునే రాజకీయాలు నడిపించవలసి ఉంది.  ఈ మూడు రాష్ట్రాలలోని మొత్తం 62.8 లక్షల మంది ఓటర్లలో మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ. గెలుపోటములను నిర్ణయించే శక్తి వారికే ఉంది.   వచ్చే ఏడాది జరుగనున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తోంది. ఈశాన్య ప్రాంత ఏడు రాష్ట్రాల్లో మొత్తం 24 సీట్లలో 17 సీట్లు జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్డీఏ)కే ఉన్నాయి.

త్రిపుర

త్రిపుర బీజేపీ శాఖలో అంతర్గత కలహాలతో బిప్లబ్ దేబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆదివాసీల మిత్రపక్షమైన ఇండిజీనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్​టీ)తో కూడా బీజేపీ సంబంధాలు దెబ్బతిన్నాయి. మిగిలిన చిన్నాచితక పార్టీలు బిక్రమ్ మాణిక్య దేబ్ బర్మ నేతృత్వంలో త్రిపుర మోర్చాగా ఏర్పడ్డాయి. దాని ప్రభావం నిరంతరం పెరుగుతుండటం కూడా బీజేపీకి క్లిష్ట పరిస్థితులను సృష్టిస్తోంది. మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ(సీపీఎం) ఈసారి ఎలాగైనా బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కడతానని ప్రతినబూనింది. దానిలో కాంగ్రెస్ తోపాటు త్రిపుర మోర్చా కూడా చేరే అవకాశాలు ప్రబలంగా ఉన్నాయి. బెంగాల్ ఎన్నికల్లో గెలిచిన ధీమాతో టీఎంసీ ఈసారి త్రిపురలో తన పట్టును చాటుకోవాలని చూస్తోంది. అయితే, అది మొత్తం 60 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా ప్రతిపక్షాల మధ్య ఐక్యతను ఛిన్నాభిన్నం చేసింది. 

- మల్లంపల్లి ధూర్జటి,సీనియర్​ జర్నలిస్ట్​