60 ఏళ్ల చరిత్రలో నాగాలాండ్ అసెంబ్లీకి తొలిమహిళ

60 ఏళ్ల చరిత్రలో నాగాలాండ్ అసెంబ్లీకి తొలిమహిళ

రోజురోజుకి మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. చాలా దేశాల్లో మహిళలు ప్రధానిగా గెలిచి తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అలాగే.. అంతరిక్షంలోకి వెళ్లి పరిశోధనలు చేస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ నుంచి ప్రధాని స్థాయి వరకు మహిళలు అన్ని రంగాల్లోనూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాని.. ఆ ప్రాంతంలో మహిళలపై 60 ఏళ్లుగా వివక్ష కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర హోదా పొంది 60 ఏళ్లు గడిచినా.. ఒక్క మహిాళ కూడా  ఇప్పటివరకు అసెంబ్లీలోకి అడుగుపెట్టకపోవడం గమనార్హం. కాని తొలిసారి 48 ఏళ్ల ఓ న్యాయవాది, సామాజిక కార్యకర్త నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించారు. 

నాగాలాండ్ రాష్ట్ర హోదా పొందిన 60 ఏళ్ల తర్వాత సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. తొలిసారి ఓ మహిళా ఎమ్మెల్యే నాగాలాండ్ అసెంబ్లీలో కాలు మోపనున్నారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మొదటి మహిళగా హెకానీ జఖాలు చరిత్ర సృష్టించారు. ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం 183 మంది అభ్యర్థుల్లో.. నలుగురు మహిళలు ఉన్నారు. వీరిలో 48 ఏళ్ల న్యాయవాది, సామాజిక కార్యకర్త అయిన జఖాలు ఒకరు. ఎమ్మెల్యే జఖాలు లోక్ జనశక్తి పార్టీకి చెందిన అజితో జిమోమిని ఓడించారు. NDPP అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె.. దిమాపుర్‌ స్థానం నుంచి 1,536 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. పశ్చిమ అంగామి స్థానంలో NDPPకి చెందిన మరో మహిళా అభ్యర్థి సల్హౌతునొ క్రుసో కూడా అధిక్యంలో ఉన్నారు. 

1963లో నాగాలాండ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లభించింది. అప్పటినుంచి ఈశాన్య రాష్ట్రంలో 13 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి. కానీ, ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టిన దాఖలాలు లేవు. తాజాగా ఎన్నికల సంఘం ప్రకటనతో హెకానీ విజయం ఖరారైంది.  రాష్ట్రంలో మొత్తం 13.17లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో దాదాపు సగం 6.56లక్షల మంది మహిళా ఓటర్లే ఉన్నారు.  అయినా, ఇప్పటివరకు అక్కడ జరిగిన మొత్తం అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 20 మంది మహిళలు మాత్రమే పోటీ చేసి పరాజయం పొందారు. 2018లో అత్యధికంగా ఐదుగురు ఎన్నికల్లో బరిలోకి దిగగా.. వారిలో ముగ్గురికి కనీసం ఆరోవంతు ఓట్లు కూడా రాలేదు. లింగ సమానత్వం హామీతో ప్రచారం చేపట్టిన అధికార NDPP.. ఈ ఎన్నికల్లో ఇద్దరు మహిళలను బరిలోకి దించగా.. కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కో మహిళకు టికెట్‌ ఇచ్చాయి.  ఇదిలా ఉంటే.. నాగాలాండ్‌లో బీజేపీ కూటమి విజయానికి దగ్గరలో ఉంది. ఇక NDPPతో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.