బీఆర్ఎస్లోకి నాగం, విష్ణువర్ధన్​: గులాబీ కండువా కప్పిన కేసీఆర్

బీఆర్ఎస్లోకి నాగం, విష్ణువర్ధన్​: గులాబీ కండువా కప్పిన కేసీఆర్

మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి, జూబ్లీహిల్స్‌ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాగం జనార్ధన్​రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి తమ అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. 

నాగం జనార్ధన్ రెడ్డికి తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉందన్నారు సీఎం కేసీఆర్. ఎన్నోసార్లు జైలుకు వెళ్లిన నేపథ్యం కూడా ఆయనకు ఉందన్నారు. బీఆర్ఎస్ లో చేరాలని తాను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశానని.. దీనికి ఆయన పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారని తెలిపారు. నాగం బీఆర్ఎస్ లో చేరడంతో పార్టీకి మరింత బలం పెరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 స్థానాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ గెలవాలన్నారు. 

విష్ణువర్ధన్ రెడ్డి భవిష్యత్తు బాధ్యత తనదే అన్నారు సీఎం కేసీఆర్. విష్ణు తన కుటుంబ సభ్యుడు అని చెప్పారు. విష్ణు తండ్రి పీజేఆర్ తనకు మంచి మిత్రుడు అన్నారు. జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, విష్ణువర్థన్​రెడ్డి కలిసి పని చేయాలని వారికి సూచించారు. అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్లాలని కోరారు. 

తెలంగాణ అభివృద్ది వేగంగా జరుగుతోందన్నారు సీఎం కేసీఆర్. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని చంపాలని చూశారని ఆరోపించారు. అయినప్పటికీ దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డాడని చెప్పారు. ఇలాంటి హత్య రాజకీయాలను తాము సహించమన్నారు. హింసాత్మక చర్యలు ఎవరు చేసినా సహించేది లేదని హెచ్చరించారు. హేయమైన దాడులకు తగిన బుద్ది చెబుదామన్నారు.