బెహెన్​జీ చొరవతోనే తెలంగాణ: నాగం జనార్ధన్ రెడ్డి

బెహెన్​జీ చొరవతోనే తెలంగాణ: నాగం  జనార్ధన్ రెడ్డి

బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి , ఢిల్లీ మాజీ సీఎం సుష్మాస్వరాజ్ మృతి నన్ను ఎంతగానో కలచి వేసింది. నన్నే కాదు ప్రతి తెలంగాణ బిడ్డను విషాదంలో పడేసింది. తెలంగాణ రావడంలో ఆమె పోషించిన పాత్రను ఇవ్వాళ అందరు గుర్తు చేసుకొని కంటతడి పెట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందంటే అందులో సుష్మ పాత్ర ఎవరూ విస్మరించలేనిది.

తెలంగాణ కోసం తల్లడిల్లిన చిన్నమ్మ ఆమె. వ్యక్తిగతంగా సుష్మ మరణం నాకెంతో  నష్టం.తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమె లోక్ సభలో ప్రతిపక్ష నేతగా ఉండి ప్రత్యేక రాష్ట్ర బిల్లును పార్లమెంట్ లో ఆమోదింపజేయడంలో పోషించిన పాత్ర ఎవరూ విస్మరించలేనిది. యూపీఏ సర్కార్ తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ, ఆ బిల్లు ఇటు లోక్ సభలో అటు రాజ్యసభలో ఆమోదం పొందడం వెనుక ఆమె కృషి, పట్టుదల, చిత్తశుద్ధిని ప్రతి తెలంగాణ పౌరుడు మరిచిపోలేదని, మరిచిపోరని కూడా నేను అనుకుంటా. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం బిల్లు ఆమోదం పొందే చివరి 23 రోజులు నేను ఢిల్లీలోనే ఉండి ప్రతి రోజు సుష్మాస్వరాజ్ ను కలిసే వాడిని. ఢిల్లీలోని సఫ్డర్  జంగ్  లేన్ లోని 8వ బంగ్లా ఆమె అధికారిక నివాసం. నేను ఎమ్మెల్యేగా ఢిల్లీలోని ఏపీ భవన్​లో  స్వర్ణముఖి  గదిలో ఉండేవాడిని. అప్పుడు తెలంగాణ ఉద్యమకారులందరికి నా గది అడ్డా. అక్కడకు అప్పటి జేఏసీ చీఫ్ కోదండరాంతో పాటు ఎందరో ఉద్యమకారులు వచ్చే వారు. ప్రతి రోజు ఉదయం లేదంటే రాత్రి ఆమె ఇంటికి నాతో పాటు ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులం వెళ్లేవాళ్లం. ఆమె ఎంత పని ఒత్తిడిలో ఉన్నా ఎలాంటి విసుగు లేకుండా, చిరు నవ్వుతో తమను పలుకరించే వారు. అయితే తెలంగాణ బిల్లు తయారు అయిన తర్వాత దాన్ని అడ్డుకునేందుకు ఆంధ్ర నేతలు చేసే లాబీయింగ్ ను, తెలంగాణలో యువకుల ఆత్మహత్యలను ఎప్పటికప్పుడు ఆమెకు నేను వివరించే వాడిని. ఆమె ఎంతో ఓపికతో వినేవారు. యువకుల ఆత్మహత్యల గురించి నేను  చెపుతుంటే ఆమె ఎంతగానో చలించిపోయే వారు.

తెలంగాణలో పుట్టకపోయినా…

తెలంగాణలో ఆమె పుట్టక పోయినా, తెలంగాణ రావాలని, అందుకోసం తనవంతు కృషి చేయాలని ఆమె ఎప్పుడూ తపనపడేవారు. ముఖ్యంగా యువకుల ఆత్మహత్యలు ఆమెను ఎంతగానో కలచి వేశాయి. యువకుల్లారా…..ఆత్మహత్యలు చేసుకోకండి, నేను మీ వెంటే ఉంటాను, తెలంగాణ ఇప్పిస్తాను అని ఎన్నోసార్లు బహిరంగంగా యువకులను కోరింది. నేను ఆమెను ఎన్నిసార్లు కలిసినా, తెలంగాణ గురించి మా బాధను మొరపెట్టుకున్నా ఎప్పుడూ ఆమె ఒకటే అనే వారు. ‘‘ జనార్ధన్ జీ….బేఫికర్ రహో, మై ఆపే కే సాత్ రహుంగీ, తెలంగాణ దిలావూంగీ’’ అని చెప్పే వారు. నేనెప్పుడూ ఆమెను బెహన్ జీ అని సంబోధించే వాడిని. 2013 సెప్టెంబర్ 28న మహబూబ్ నగర్ లో  తెలంగాణ సభ నిర్వహిస్తే దానికి సుష్మాను ముఖ్య అతిధిగా ఆహ్వానించాను. సుమారు లక్ష మంది వరకు తరలి వచ్చిన ఈ సభలో సుష్మా ప్రసంగించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. తన స్పీచ్ తో ఆమె తెలంగాణ వాదుల్లో ఉన్న ఆందోళనను తొలగించే ప్రయత్నం చేసింది.  ప్రత్యేక రాష్ట్రం  వస్తుంది…ధైర్యంగా ఉండండని ఆమె మహబూబ్ నగర్ వేదికగా తెలంగాణ జనాన్ని కోరింది. తెలంగాణ తప్పక వస్తుందనే ఒక విశ్వాసాన్ని ఆమె  ఇక్కడి వారిలో  నింపగలిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత సుష్మాస్వరాజ్ జరుపుకున్న మొదటి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెప్పేందుకు నేను, ఇతర తెలంగాణ ఉద్యమకారులం సుష్మా  ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కరికి ఆమె స్వీట్ బాక్స్ ఇచ్చి సంతోషాన్ని పంచుకున్నారు.

బిల్లు ఆమోదం కోసం ఒప్పించిన తీరు అద్భుతం

తెలంగాణ బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చినప్పుడు సుష్మా స్వరాజ్ ఎంతో నేర్పు, ఓర్పును చూపించారు. యూపీఏ  సర్కార్ లోక్ సభలో బిల్లు పెట్టినప్పుడు ప్రతిపక్ష నేతగా ఆమె ముందుండి బిల్లును ఆమోదింపజేశారు. ఇక రాజ్యసభలోకి బిల్లు వెళ్లిన సందర్భంలో కొన్ని సవరణలు చేయాల్సి ఉందని  వెంకయ్య నాయుడు దీన్ని తిరిగి వెనక్కు పంపించే ప్రయత్నం చేయగా, సుష్మ వెంటనే జోక్యం చేసుకొని అప్పటి సీనియర్​ నేతలు అరుణ్ జైట్లీ, ప్రకాష్ జవదేకర్​లను ఒప్పించి రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందేలా చొరవ చూపారు.  సవరణల పేరుతో బిల్లు తిప్పి పంపితే మళ్లీ లోక్ సభ ఆమోదం పొందడం కష్టమవుతుందని భావించిన సుష్మ సవరణలకు ససేమిరా అన్నారు. లోక్ సభలో ఆమె బిల్లుపై ప్రతిపక్ష  నేత హోదాలో  మాట్లాడుతూ….. తెలంగాణ బిల్లు సభలో పెట్టిన పెద్దమ్మ ( సోనియా ) తో పాటు ఆ బిల్లు ఆమోదింపజేయడానికి కృషి చేసిన ఈ చిన్నమ్మ ( సుష్మాస్వరాజ్ ) ను గుర్తుంచుకోండని తెలంగాణ ప్రజలకు ఆమె పార్లమెంట్ వేదికగా విన్నవించారు.

సీఎం కేసీఆర్ తీరు బాధాకరం

సుష్మాస్వరాజ్ మరణిస్తే అంతటి నాయకురాలికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ లు సంతాపం ప్రకటించిన తీరు చాలా బాధాకరం. తెలంగాణతో ఏమాత్రం సంబంధం లేని నేతగా ఆమెను గుర్తించి సంతాపం చెప్పినట్లుగా ఉంది. ఆనాడు తెలంగాణ బిల్లు పాస్ చేయించడంలో ఆమె పాత్ర లేకుంటే ఈ తెలంగాణ వచ్చేదా…? కేసీఆర్ సీఎంగా ఉండేవారా…? ఆమెకు సంతాపం ప్రకటించే తీరు ఇదేనా…? తెలంగాణ ప్రజల తరపున కేసీఆర్ సుష్మాస్వరాజ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లాల్సి ఉండె. కానీ ఆయన ఆమె అంత్యక్రియలకు హాజరవకుండా తెలంగాణ ప్రజలను అగౌరవ పరిచారు.  హైదరాబాద్ లోని ఏదైనా ఒక చౌరస్తాలో  ఆమె విగ్రహం ప్రతిష్టించి, ఆ రోడ్ కు  ఆమె పేరు పెట్టాలి.

తెలంగాణ కోసమే బీజేపీలోకి…

నేను బీజేపీలో  రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేరాను. కేవలం తెలంగాణ కోసమే ఆ పార్టీలో చేరాను. అప్పుడు కూడా నేను బీజేపీ చీఫ్ ను  ఒకటే కోరాను. కాంగ్రెస్ బిల్లు పెడితే మద్ధతు ఇవ్వాలని, లేదంటే ఎన్డీయే అధికారంలోకి వచ్చిన నెలలోపే తెలంగాణ బిల్లు పెట్టాలని, ఈ షరతుపైనే కాషాయ కండువా కప్పుకున్నాను. అందుకే   పార్టీలో నన్ను సుష్మాస్వరాజ్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. పార్టీలో నా ఎదుగుదలకు ఆమె ఎంతగానో సహకరించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నేను పని చేయడం, ఆమె కూడా ఆ శాఖకు కేంద్రంలో మంత్రిగా పనిచేయడంతో ఆమెతో నాకు సాన్నిహిత్యం పెరిగింది.  హైదరాబాద్ నిమ్స్ లో స్పెషాలిటీ బ్లాక్ కు ఆమె కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హోదాలో  నిధులిచ్చినప్పటి నుంచి  సుష్మ పై  గౌరవం, అభిమానం పెరిగాయి. 1968లో తెలంగాణ ఉద్యమంలో ఓయూ మెడికల్ విద్యార్ధి నేతగా నేను పాల్గొన్నాను. నాపై  అప్పుడు ఏకంగా 107 పోలీస్ కేసులు పెట్టారు. నెలల తరబడి జైల్లో ఉన్నా. కేసీఆర్ వలె ఉద్యమంలో పాల్గొనకుండా ఎప్పుడూ లేను. బెహన్ జీకి ఇదే నా నివాళి.
-నాగం జనార్ధన్ రెడ్డి