బీజేపీ, టీఆర్‌‌ఎస్‌ల హైడ్రామా బయటపడింది : మాజీ మంత్రి నాగం

బీజేపీ, టీఆర్‌‌ఎస్‌ల హైడ్రామా బయటపడింది : మాజీ మంత్రి నాగం

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : కాంగ్రెస్‌ గుర్తుపై గెలిచి  సీఎం కేసీఆర్‌‌కు అమ్ముడుపోయిన  ఎమ్మెల్యేలు రిజైన్‌ చేసి, మళ్లీ పోటీ చేయాలని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం నాగర్ కర్నూల్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్‌‌ఎస్‌ల హైడ్రామా బయటపడిందని విమర్శించారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేస్తే  రెండు పార్టీలకు వెన్నులో వణుకు మొదలైందన్నారు.  కాంగ్రెస్‌ దేశానికి స్వాతంత్ర్యం తేవడమే కాదు  పేదలకు కూడు, గూడు ఇచ్చిందని గుర్తు చేశారు.  ఎన్నో పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిందన్నారు.

బీజేపీ నోట్ల రద్దు, జీఎస్టీతో కార్పొరేట్లకు మేలు చేసిందే తప్ప సామాన్యులకు కాదన్నారు. బీజేపీకి స్వాతంత్ర్యోద్యమానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్‌‌ను తమ వ్యక్తులుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.  సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్టర్ల వద్ద కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు.   ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం చేయాలని సవాల్ విసిరారు.  ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి అర్థం రవి, కాంగ్రెస్ నేతలు టి.పాండు, బాల గౌడ్, నారాయణ గౌడ్, లక్ష్మయ్య పాల్గొన్నారు.