ధరణి రిజిస్ట్రేషన్ కోసం 12వేలు లంచం డిమాండ్

ధరణి రిజిస్ట్రేషన్ కోసం 12వేలు లంచం డిమాండ్
  • లంచం డబ్బులు తీసుకుంటూ ఏసీబీకీ దొరికిన కొల్లాపూర్ తాహశీల్దార్, వీఆర్ఏ, కంప్యూటర్ ఆపరేటర్

నాగర్ కర్నూల్: ధరణి రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్ చేశారు కొల్లాపూర్ రెవెన్యూ సిబ్బంది. బాధితుడు గురువారం 12వేలు లంచం డబ్బులు తీసుకుని కొల్లాపూర్ తాహశీల్దార్ ఆఫీసుకు రాగా.. కంప్యూటర్ ఆపరేటర్.. వీఆర్ఏతోపాటు తాహశీల్దార్ ముగ్గురు లంచం డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 
 కుడికిళ్ల గ్రామానికి చెందిన రైతు బంగారు స్వామి నార్లాపూర్ శివారులో తన చెల్లి కి భూమి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మీసేవలో స్లాట్ బుక్ చేసుకున్నాడు. సర్వే నెంబర్ 305లో ఉన్న 5.20 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ కోసం 7 డాక్యుమెంట్ల స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ కోసం తాహశీల్దార్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాడు. కంప్యూటర్ ఆపరేటర్, వీఆర్ఏ ఇద్దరు కలసి లంచం ఇవ్వనిదే పనికాదని తేల్చిచెప్పారు. ఇదేమిటని తాహశీల్దార్ షౌకత్ అలీని కలసి ఫిర్యాదు చేయగా.. తమకు కూడా ఆఫీసు ఖర్చులుంటాయని సమాధానం ఇచ్చి సిబ్బందిని వెనకేసుకువచ్చారు. దీంతో తనకు పరోక్షంగా లంచం డిమాండ్ చేస్తున్నారని గుర్తించిన బాధితుడు బేరం ఆడగా 12వేలు తీసుకునేందుకు అంగీకరించారు.  
రెవెన్యూ సిబ్బంది తీరుతో విసిగిపోయిన రైతు బంగారు స్వామి ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. వారిచ్చిన 12వేలు లంచం డబ్బు తీసుకుని గురువారం  కొల్లాపూర్ తాహశీల్దార్ ఆఫీసుకు చేరుకున్నారు. వీఆర్ఏ స్వామి, కంప్యూటర్ ఆపరేటర్ శివ రూ.12వేలు లంచం తీసుకున్న వెంటనే ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. తహసీల్దార్ షౌకత్ అలీ చెప్పిన మేరకు తాము లంచం తీసుకుంటున్నామని వీఆర్ఏ స్వామి, కంప్యూటర్ ఆపరేటర్ శివ చెప్పడంతో ఏసీబీ అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.