నాగర్ కర్నూలు జడ్పీ మీటింగ్కు ఒకే ఒక్కడు

నాగర్ కర్నూలు జడ్పీ మీటింగ్కు ఒకే ఒక్కడు

నాగర్ కర్నూల్: మునుగోడు ఉప ఎన్నిక ప్రభావం రాష్ట్రం నలుమూలలా కనిపిస్తోంది. నెల రోజులుగా జిల్లాకు చెందిన కీలక నేతలంతా మునుగోడు చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. గత 22 రోజుల క్రితం ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి చాలా మంది మునుగోడులోనే మకాం వేసి సొంతూరికి.. సొంత మండలానికి వారానికోసారి.. వీలైనప్పుడు మాత్రమే వచ్చి వెళుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతుండడంతో మారు మూల ప్రాంతాల నాయకులు సైతం తమ స్థాయి.. ఉనికిని స్థానికంగా చాటుకునేందుకు మునుగోడులో ప్రచారంలో పాల్గొంటూ.. ఫోటోలు.. వీడియోలను తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు షేర్ చేస్తున్నారు. 

జడ్సీ జనరల్ బాడీ మీటింగ్ పెడితే.. హాజరైంది ఒకే ఒక సభ్యుడు (ఎంపీపీ)

నాగర్ కర్నూలు  జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా పడింది. ఎమ్మెల్యేలు, మెజారిటీ జడ్పీటీసీ సభ్యులతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు మునుగోడు ఎన్నికల ప్రచారానికి వెళ్లడంతో అధికారులు మీటింగ్ ను వాయిదా వేశారు. జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే జిల్లా పరిషత్ మీటింగ్ కి ఒక్క ఎంపీపీ మాత్రమే హాజరయ్యారు. జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి తెలిపారు. దీంతో ఎలాంటి చర్చ జరక్కుండానే అధికారులు కూడా వెళ్లిపోయారు.