పండక్కి పర్ఫెక్ట్‌ సినిమా నా సామిరంగ: నాగార్జున

పండక్కి పర్ఫెక్ట్‌ సినిమా నా సామిరంగ: నాగార్జున

భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజుల్లో జరిగే కథే ‘నా సామిరంగ’ చిత్రమని అన్నారు నాగార్జున. విజయ్ బిన్ని దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నాగార్జున చెప్పిన విశేషాలు. మలయాళ సినిమా పోరింజు మరియం జోస్ నుంచి ఈ లైన్ తీసుకున్నాం. 1980 బ్యాక్‌‌డ్రాప్‌‌లో జరిగే కథ. మన నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి అచ్చమైన తెలుగు చిత్రంలా రూపొందించాం. కోనసీమ సంక్రాంతి ప్రభల తీర్ధం నేపథ్యంలో సాగుతూ పండక్కి పర్ఫెక్ట్‌‌గా రాబోతున్న సినిమా ఇది. స్నేహం, ప్రేమ, త్యాగం, విశ్వాసం.. ఇలా అన్ని హ్యూమన్ ఎమోషన్స్‌‌తో సాగుతూ ఆకట్టుకుంటుంది.

యాక్షన్ సీన్స్ చాలా మ్యాసీగా ఉంటాయి. విజయ్ బిన్నికి  మంచి విజువల్ సెన్స్ ఉంది. తను కొరియోగ్రఫీ చేసిన పాటలు చూశాను. డ్యాన్స్‌‌లా కాకుండా పాటలోనే మంచి కథని చెప్పే నేర్పు తనలో ఉంది. అది నచ్చి.. ఈ కథను తన చేతిలో పెట్టా. చాలా క్లారిటీగా తీశాడు. నేను కిష్టయ్య పాత్రలో కనిపిస్తా.  అల్లరి నరేష్, నేను ప్రాణ స్నేహితులుగా కనిపిస్తాం. నరేష్​ యాక్టింగ్‌‌లోని కొత్తదనం అందరికీ నచ్చుతుంది. అలాగే రాజ్‌‌ తరుణ్ కీలక పాత్ర పోషించాడు.  ఆషికా రంగనాథ్‌‌తో నాకు  టిపికల్ లవ్ స్టోరీ ఉంది. మా ఇద్దరి మధ్య 12 ఏళ్ళ నుంచి ఒక ప్రేమకథ నడుస్తుంది. ముఫ్ఫై ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళ ప్రేమకథ నడుస్తుంది. డిఫరెంట్ లవ్ స్టోరీలో ఆషికా  చక్కగా నటించింది.  ప్లానింగ్ ప్రకారం 72 రోజుల్లో ఈ మూవీ షూటింగ్ పూర్తి చేశాం.  ప్రీ ప్రొడక్షన్ పక్కాగా చేసుకోవడంతోనే  ఇంత ఫాస్ట్ వర్క్ చేయడం సాధ్యమైంది.  ఇంత ఫాస్ట్‌‌గా, ఇంత పెద్ద స్కేల్‌‌లో చేశామంటే దానికి కీరవాణి గారు ఒక కారణం.  ఇందులో ప్రతి పాట అద్భుతంగా ఉంటుంది. ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నా. మరో చిత్రం లైన్‌‌లో ఉంది’’.