Nagarjuna: శివ' రీరిలీజ్.. డాల్బీ అట్మాస్‌తో మరోసారి థియేటర్లలో సందడి!

Nagarjuna: శివ' రీరిలీజ్..  డాల్బీ అట్మాస్‌తో మరోసారి థియేటర్లలో సందడి!

తెలుగు సినీ చరిత్రలో కొన్ని చిత్రాలు కేవలం సినిమాలుగా కాకుండా.. ఒక తరం జ్ఞాపకాలుగా చెరగని ముద్ర వేసుకుంటాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన సినిమా కింగ్ అక్కినేని నాగార్జున నటించిన 'శివ'. 1989లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఒక సంచలనం. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రతిభకు, నాగార్జునలోని సరికొత్త నటుడికి ఇది ఒక వేదికగా నిలిచింది. ముఖ్యంగా, కాలేజీ రాజకీయాలు, గ్యాంగ్ వార్లను వాస్తవికతకు దగ్గరగా చూపించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇందులో  శివ సైకిల్ చైన్‌ వంటి సాధారణ వస్తువులను పోరాట సన్నివేశాలకు ఉపయోగించి వర్మ అప్పటి ఫార్ములా సినిమాల నుంచి బయటపడి కొత్త ట్రెండ్ సృష్టించారు.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై వచ్చిన ఈ సినిమా అప్పటివరకు తెలుగు ప్రేక్షకులకు తెలియని కొత్త తరహా కథాంశాన్ని, టేకింగ్‌ను పరిచయం చేసింది. ఈ సినిమా విడుదలైన తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో కథల ఎంపిక, దర్శకత్వ శైలిలో గణనీయమైన మార్పు వచ్చింది. 'శివ'కు ముందు, 'శివ' తర్వాత అనేంతగా ఈ సినిమా ప్రభావం చూపించింది. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. కల్ట్ క్లాసిక్ చిత్రంగా ఎప్పటికీ నిలిచిపోయే ఈ సినిమా ఇప్పుడు మరింత మెరుగైన సాంకేతికతతో మళ్లీ ప్రేక్షకులను అలరించనుంది.

అక్కినేని నాగేశ్వరరావు (ANR) జయంతిని పురస్కరించుకుని ఈ సినిమాను నవంబర్ 14న 4K వెర్షన్‌లో రీ-రిలీజ్ చేయనున్నట్లు నాగార్జున ప్రకటించారు. 34 ఏళ్ల తర్వాత విడుదలవుతున్న ఈ చిత్రం కోసం మోనో మిక్సింగ్‌ నుంచి డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌కి మార్చేశారు. ఈ సందర్భంగా నాగార్జున X వేదికగా తన అన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కొన్ని సినిమాలు తరాలు మారినా కొత్తగానే ఉంటాయి. 'శివ' అలాంటి వాటిల్లో ఒకటి. ఈ కల్ట్ క్లాసిక్‌ని ఇప్పుడు 4Kలో విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాన్నకు మా నివాళి అని అన్నారు.

 

ఆ కాలంలో యువతను ఉర్రూతలూగించిన 'శివ'ను ఇప్పుడు కొత్తతరం ప్రేక్షకులు పెద్ద తెరపై 4K క్వాలిటీ, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో చూసే అవకాశం లభించింది. ఈ రీ-రిలీజ్, పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడంతో పాటు, తెలుగు సినిమా చరిత్రలో ఒక ముఖ్య ఘట్టాన్ని సరికొత్తగా అనుభూతి చెందడానికి ఒక అరుదైన అవకాశం. ఈ సినిమాతో నాగార్జున కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది, అదే విధంగా రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా ఒక బలమైన ముద్ర వేసుకున్నారు. ఈ రీ-రిలీజ్ పాత, కొత్త ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.