- నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా తూడుకుర్తి సమీపంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను కలెక్టర్ బాదావత్ సంతోష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వచ్చే జూన్ నాటికి అకాడమిక్ కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా పనులు వేగవంతం చేయాలని, ఆధునిక సౌకర్యాలతో పాటు ఆటస్థలాలు, తాగునీరు, పారిశుధ్య వసతుల్లో నాణ్యత పాటించాలని ఇంజినీర్లను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలిస్తూ వచ్చే నెల 20లోపు గృహప్రవేశాలకు సిద్ధం చేయాలన్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందించే పౌష్టికాహారాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, తక్కువ బరువున్న కోడిగుడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని సిబ్బందిని హెచ్చరించారు.
రాజకీయాలకు అతీతంగా పాలన ఉండాలి..
రాజకీయ ఎదుగుదలకు సర్పంచ్ పదవి బలమైన పునాది లాంటిదని, దీనిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో కొల్లాపూర్ నియోజకవర్గ సర్పంచులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళా సర్పంచులు తమ పరిపాలనలో కుటుంబ సభ్యుల జోక్యం లేకుండా సొంతంగా నాయకత్వ పటిమను ప్రదర్శించాలని కోరారు.
గ్రామాల అభివృద్ధిలో రాజకీయాలకు తావివ్వకుండా తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని, అంగన్వాడీలు, పాఠశాలలను నిరంతరం పర్యవేక్షిస్తూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు.
సలేశ్వరం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
ఏప్రిల్ 1 నుంచి 3 వరకు జరిగే సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాట్లపై ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌తో కలిసి నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, రాత్రి వేళ భక్తుల కోసం సోలార్ లైట్లు, వైద్య శిబిరాలు, సరిపడా ఆర్టీసీ బస్సులు, తాగునీటి వసతి కల్పించాలని సూచించారు.
భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, గర్భిణులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఈ యాత్రకు రాకపోవడమే మంచిదని ఆయన సూచించారు.
