పునరావాస గ్రామాన్ని మోడల్​గా తీర్చిదిద్దాలి : ఉదయ్​కుమార్

పునరావాస గ్రామాన్ని మోడల్​గా తీర్చిదిద్దాలి : ఉదయ్​కుమార్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నల్లమల్ల టైగర్  రిజర్వ్ నుంచి తరలిస్తున్న గ్రామస్తుల కోసం అన్ని సౌలతులతో పునరావాస గ్రామాన్ని మోడల్ గా తీర్చిదిద్దాలని కలెక్టర్  ఉదయ్ కుమార్  సూచించారు. శుక్రవారం కలెక్టరేట్  మీటింగ్  హాలులో అడిషనల్​ కలెక్టర్లు కుమార్ దీపక్, సీతారామారావు, డీఎఫ్ వో రోహిత్ గోపిడీతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ సార్లపల్లి గ్రామ తరలింపు కోసం గ్రామ సభలో తీర్మానించి, అంగీకారం తెలిపిన 186 కుటుంబాల పునరావాస ప్రక్రియను నిర్ణీత షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ప్రకారం కంప్లీట్​ చేయాలని ఆదేశించారు. టైగర్  రిజర్వ్  ప్రాంతం నుంచి స్వచ్ఛందంగా తరలివెళ్లేందుకు ముందుకొచ్చిన గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సార్లపల్లి గ్రామంలో 186 కుటుంబాలను గుర్తించగా, అందులో 85 కుటుంబాలు రూ.15 లక్షల పరిహారం తీసుకుంటామని గ్రామసభలో చెప్పారని, మిగిలిన 101 కుటుంబాలకు బాకారం సమీపంలో 220 గజాల చొప్పున ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఇంటి స్థలం కోసం కేటాయించిన భూమిని డెవలప్​మెంట్​ను సకాలంలో పూర్తి చేయాలన్నారు. అవసరమైన ఫండ్స్​ అటవీ శాఖ వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సీసీ రోడ్లు, తాగునీరు, విద్యుత్, అంగన్​వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూల్, గ్రామ పంచాయతీ బిల్డింగ్​ నిర్మాణానికి ప్రపోజల్స్​ సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం సార్లపల్లి గ్రామస్తులతో మాట్లాడి వారి ప్రతిపాదనలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని  సంబంధిత అధికారులను ఆదేశించారు. డీటీడబ్ల్యూవో కమలాకర్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.