నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: విద్య, వైద్యానికే ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సోమవారం ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్ రెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. నాణ్యమైన విద్యతో భవిష్యత్తు తరాలకు బలమైన పునాది వేయగలమని, అదే రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. పేదల ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 109 ట్రామా సెంటర్లు నిర్మించామని, వృద్ధుల కోసం 37 ప్రణామ్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. పలువురు విద్యార్థులతో మంత్రి మాట్లాడారు.
జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నారు? ఎలాంటి లక్ష్యాలతో ముందుకెళ్తున్నారు? అని ప్రశ్నించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం నాగర్ కర్నూల్ పట్టణంలోని 245 మంది మహిళా సంఘాల సభ్యులకు రూ.7.80 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కును
అందజేశారు.
