నాగర్కర్నూల్ జిల్లాలో వానొస్తే వాగులు దాటలేరు .. వంతెనలు లేక పల్లె జనం పరేషాన్

నాగర్కర్నూల్ జిల్లాలో వానొస్తే వాగులు దాటలేరు .. వంతెనలు లేక పల్లె జనం పరేషాన్
  • జలదీక్షలు చేసినా పట్టించుకునేవారు లేరని ఆవేదన
  • నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్​ని యోజకవర్గాల్లో 20 ఏండ్లుగా సమస్య

నాగర్​కర్నూల్, వెలుగు: వానాకాలం వస్తే చాలు ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతాయి. మనుషులు, వాహనాలు దాటకుండా బారికేడ్లతో పోలీస్, రెవెన్యూ చెక్​పోస్టులు ఏర్పాటవుతాయి. మూడు నియోజకవర్గాల మీదుగా ప్రవహించే దుందుబి వాగు మొదలుకొని చిన్నాచితక వాగులకు ప్రవాహం మొదలైతే ఎవరినీ దాటనీయవు. దాదాపు 20 ఏండ్లుగా ఈ సమస్య వేధిస్తున్నా ఆర్అండ్​బీ, పంచాయితీరాజ్​ఇంజినీరింగ్ ​అధికారుల  ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. 

నాగర్ కర్నూల్ జిల్లాలోని నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్​నియోజకవర్గాల్లో వాగులపై వంతెనలు నిర్మించాలని ప్రజలు జలదీక్షలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఎలాంటి చర్యలు లేవని, తమ బాధను ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా వాగులపై బ్రిడ్జిల నిర్మాణంలో ఒక్కడుగు కూడా ముందుకు పడటం లేదన్న 
విమర్శలున్నాయి. 

బ్రిడ్జిలు నిర్మించాల్సింది ఇక్కడే..

  • నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని తాడూరు మండలం సిరసవాడ, ఐతోలు గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. నిర్మిస్తానని ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డి హామీ ఇచ్చారు.  
  • నాగర్ కర్నూల్ పట్టణం నుంచి నాగనూలు గ్రామానికి రోడ్డుపై బిడ్జి అవసరం. గతేడాది ఇక్కడ ఒక వ్యక్తి వరదలో కొట్టుకుపోతుండగా కానిస్టేబుల్​రక్షించాడు. 
  • తెలకపల్లి మండలం కార్వంగ-, నడిగడ్డ మధ్య బ్రిడ్జి ఐదేళ్లుగా పిల్లర్లకే పరిమితమైంది. గొర్రెల కాపరులు వరదలో చిక్కుకుంటే రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్​ బృందాలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. 
  • అచ్చంపేట టౌన్​నుంచి ఉప్పునుంతలకు వెళ్లే రోడ్డులో రూ.40 లక్షలతో చేపడుతున్న కల్వర్టు నిర్మాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. 
  • అచ్చంపేట నుంచి చౌటపల్లి వెళ్లే రోడ్డులో చంద్రవాగు వరద కాజ్​వేను దాటనీయదు. ఇది చౌటపల్లి, బాణాల గ్రామాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అధికారులు బ్రిడ్జి నిర్మాణం కోసం కనీసం ప్రపోజల్స్​కూడా పంపించడం లేదు. 
  • లింగాల మండల కేంద్రం నుంచి అప్పాయిపల్లికి వెళ్లే దారిలో చిన్నవాగుపై రెండేళ్ల కింద రూ.15 లక్షలతో చేపట్టిన వంతెన పనులు మధ్యలోనే ఆగిపోయాయి. 
  • లింగాల–చెన్నంపల్లి దారిలో వాగుపై  వంతెన నిర్మించాల్సి ఉంది. చెన్నంపల్లి నుంచి పద్మనపల్లి దారిలోని వాగుకు వరద వస్తే రాకపోకలు మరిచిపోవాల్సిందే. 
  • లింగాల–అంబటిపల్లి రోడ్డులో కేసీ తండా గేట్ దగ్గర వాగుపై వంతెన పెండింగ్​లో ఉంది. 
  •  దుందుబి వాగు పరివాహక ప్రాంత మండలాలైన కల్వకుర్తి, తాడూరు,ఉప్పునుంతల, వంగూరు మండలాల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాజ్​వేల పైనుంచి ప్రవహించే వరదతో అటు, ఇటు ఎవరూ దాటకుండా పోలీసులు చెక్​పోస్టులు ఏర్పాటు చేస్తారు. హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం పదేండ్ల కింద రూ.45 కోట్ల అంచనాతో ప్రపోజల్స్ పంపించామని అధికారులు చెబుతుంటారు. 
  • లక్ష్మాపూర్, దాసర్లపల్లి మధ్యలో ఉన్న చీకటి వాగుకు వరద ఉధృతి పెరిగితే దాసర్లపల్లి నుంచి మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోతాయి. 
  • కోడేరు మండలంలో పసుపుల, పెద్దకొత్తపల్లి, వెన్నచెర్ల, అంబట్​పల్లి వాగులు, కొల్లాపూర్​మండలంలో మారేడుమాన్​ దిన్నె నుంచి కొల్లాపూర్​వెళ్లే దారిలో పెద్దవాగుకు వరదలొస్తే వ్యవసాయ పనులు బంద్ పెట్టి, రైతులు, పశువులు ఎక్కడికక్కడ ఉండిపోవాల్సిందే.
  • కల్వకుర్తి మండలంలోని రఘుపతిపేట వద్ద దుందుబి వాగుకు వరదొస్తే కల్వకుర్తి, తెల్కపల్లి, లింగాల మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోతాయి.