నాగోబా జాతర : గంగాజలంతో తిరుగు ప్రయాణం

నాగోబా జాతర : గంగాజలంతో తిరుగు ప్రయాణం
  • జన్నారంలోని కలమడుగులో పూర్తయిన తంతు
  • నేడు ఉట్నూర్​కు చేరుకోనున్న మెస్రం వంశీయులు

జన్నారం, వెలుగు: ఆదివాసుల ఆరాధ్య దైవమైన నాగోబాకు అభి షేకం చేసేందుకు పాదయాత్ర చేపట్టిన మెస్రం వంశీయులు ఆదివారం పవిత్ర గోదావరికి చేరుకున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గోదావరి రేవులోని హస్తినమడుగు వద్దకు చేరుకొని పూజలు చేసి పవిత్ర జలంతో తిరుగు ప్రయాణమయ్యారు. ప్రతి సంవత్సరం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ ఆలయంలోని నాగోబాకు గోదావరిలోని హస్తినమడుగు నుంచి తీసుకెళ్లిన గంగాజలంతో అభిషేకం చేయడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ నెల 21న కేస్లాపూర్ నుంచి 200 మంది మెస్రం వంశీయులు బయలుదేరారు.

సుమారు 80 కిలోమీటర్ల మేర కాలినడకన కలమడుగులోని గోదావరి రేవుకు చేరుకుని అక్కడి హస్తినమడుగులో గంగస్నానం చేసిన తర్వాత పితృ దేవతలకు పూజలు చేశారు. అభిషేకం చేసేందుకు వెంట తెచ్చిన జరిలో జలాన్ని తీసుకొని తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా కాలినడకన సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కు చేరుకొని రాత్రి బస చేస్తారు. 30న ఇంద్రవెల్లి మండలంలోని దోడందకు చేరుకుని ఫిబ్రవరి4 వరకు అక్కడే ఉంటారు. 5న ఇంద్రవెల్లి ఇంద్రాదేవి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. అదే రోజు కేస్లాపూర్​లోని మర్రి చెట్టు వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేసి మూడు రోజులు బస చేస్తారు. ఫిబ్రవరి 9న అర్ధరాత్రి నాగోబా ఆలయానికి చేరుకొని వెంట తీసుకెళ్లిన పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి మహాపూజ నిర్వహించి నాగోబా జాతరను ప్రారంభిస్తారు.