లాక్ డౌన్ లో పెళ్లి: త‌ల్లిదండ్రులు లేని యువ‌తికి పోలీసులే ఫ్యామిలీగా మారి..

లాక్ డౌన్ లో పెళ్లి: త‌ల్లిదండ్రులు లేని యువ‌తికి పోలీసులే ఫ్యామిలీగా మారి..

క‌ర‌కు ఖాకీ చొక్కా వెనుక మంచి మ‌న‌సును మ‌రోసారి చాటుకున్నారు పోలీసులు. త‌ల్లిదండ్రులు లేని ఓ యువ‌తికి ఆ లోటు తెలియ‌కుండా పెళ్లి చేశారు పోలీస‌న్న‌లు. క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో బంధువులెవ‌రూ రాలేక‌పోవ‌డంతో అమ్మాయి త‌ర‌ఫున‌ అన్నీ తామే అయ్యి చూసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌ మ‌హారాష్ట్ర‌లోని నాగ్ పూర్ లో జ‌రిగింది.

త‌న వాళ్లు ఎవ‌రూ లేర‌న్న లోటు తీరుస్తూ..

లాక్ డౌన్ స‌మ‌యంలో చాలా వ‌ర‌కు పెళ్లిళ్లు క్యాన్సిల్ అయ్యాయి. అయితే 50 మంది లోపు బంధువుల‌ను పిలుచుకుని వివాహం చేసుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. దీంతో అక్క‌డ‌క్క‌డ ప‌రిమిత సంఖ్య‌లో చుట్టాల‌తో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే వీటికి పోలీసుల అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి. ఇలా నాగ్ పూర్ లో ఓ జంట పెళ్లి చేసుకునేందుకు ప‌ర్మిష‌న్ తీసుకుంది. అయితే ఆ జంట‌లో పెళ్లి కూతురికి త‌ల్లిదండ్రులిద్ద‌రూ లేరు. పైగా లాక్ డౌన్ స‌మ‌యం కావ‌డంతో బంధువులెవ‌రూ రాలేని ప‌రిస్థితి నెల‌కొంది. ఆ యువ‌తి త‌ల్లిదండ్రులు గ‌తంలోనే మ‌ర‌ణించార‌న్న విష‌యం తెలుసుకున్న పోలీసులు.. ఆమెకు పెళ్లిలో త‌న వాళ్లు ఎవ‌రూ లేరన్న లోటు తీర్చాల‌నుకున్నారు. దీంతో నాగ్ పూర్ లోని ఆ పెళ్లి జ‌రుగుతున్న‌ ఏరియా పోలీస్ స్టేష‌న్ ఇన్ స్పెక్ట‌ర్, ఇత‌ర స్టాఫ్ అంతా ఆ వివాహానికి వెళ్లారు. పెళ్లి కొడుకు త‌ర‌ఫున అత‌డి త‌ల్లిదండ్రులు, ఇత‌ర కుటుంబ‌స‌భ్యులు ఉండ‌గా.. పోలీసులే పెళ్లి కూతురి కుటుంబమ‌య్యారు. వారి పెళ్లి వేడుక ముగిసే వ‌ర‌కు ఉండి.. ఆశీర్వ‌దించారు. ఈ విష‌యాన్ని బుధవారం నాగ్ పూర్ పోలీస్ ఆఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. నెటిజ‌న్లు పోలీసుల‌కు హ్యాట్సాఫ్ చెప్పారు. సూప‌ర్, గుడ్ వ‌ర్క్. సెల్యూట్ అంటూ పోలీసుల్ని అభినందించారు.