నల్గొండ జిల్లాలో గంజాయి రవాణా కేసులో నలుగురు అరెస్టు

నల్గొండ జిల్లాలో  గంజాయి రవాణా కేసులో నలుగురు అరెస్టు

నకిరేకల్, (వెలుగు): గంజాయి రవాణా కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శివరామిరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక పీఎస్​లో వివరాలు వెల్లడించారు. ఈ నెల 10న కేతేపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామ పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా 3 బైక్​లపై వస్తున్న ఏడుగురు వ్యక్తులు వారిని చూసి పారిపోవడానికి యత్నించారు. ఇద్దరు పారిపోగా మిగితావారు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి రవాణా చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. 

శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామానికి చెందిన సోము సాయి తేజ, ఐలపాక ప్రభు, సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పగిడిమర్రి మహేశ్, నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం బండ పాలెం గ్రామానికి చెందిన వంగూరి ప్రేమ్ కుమార్, నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన నారగోని వేణు, కేతేపల్లి మండలం కాసనకోడు గ్రామానికి చెందిన శ్రీపతి ఉదయ్ ముఠాగా ఏర్పడి ఒడిశా రాష్ట్రాంలోని కోరమనూరులో పరదాల్ వద్ద గంజాయి కొనుగోలు చేయడం మొదలుపెట్టారు.

 పది రోజుల కింద కోరమనూరు వెళ్లి 2.5 కేజీల గంజాయి కొనుగోలు చేసి దానిని తలా 300 గ్రాముల  చొప్పున పంచుకున్నారు. నల్ల కవర్లలో నింపి వంగమర్తి నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా పోలీసులకు దొరికారు. వారి వద్ద నుంచి రూ.37,500  విలువగల 1.5 కేజీల గంజాయి, 3 సెల్ ఫోన్లు, రెండు పల్సర్ బైక్​లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. పారిపోయిన నారగోని వేణు, శ్రీపతి ఉదయ్ గురించి వెతుకుతున్నట్లు చెప్పారు. 

పోగొట్టుకున్న 31 సెల్ ఫోన్లు అప్పగింత

నకిరేకల్, (వెలుగు):నకిరేకల్ పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రూ.4 లక్షల విలువ గల 31 మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి రికవరీ చేసి బాధితులకు అందజేశారు. మంగళవారం నకిరేకల్ పీఎస్​లో డీఎస్పీ శివరాం రెడ్డి  సెల్‌‌ఫోన్‌‌ రికవరీలో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్‌‌ వెంకటేశ్వర్లును అభినందించారు. తమ ఫోన్లు తిరిగి అందుకున్న బాధితులు డీఎస్పీకికృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

దేవరకొండ, (కొండమల్లేపల్లి): పోలీస్ అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా పనిచేయాలని డీఎస్పీ శివరాం రెడ్డి సూచించారు. మంగళవారం చిట్యాల పీఎస్​ను సీఐ నాగరాజుతో కలిసి  తనిఖీ చేశారు. పెండింగ్‌‌ కేసుల వివరాలను ఆరా తీసి త్వరగా పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ ఫిర్యాదులలో జాప్యం లేకుండా పరిష్కరించాలన్నారు. పాత నేరస్తులు, రౌడీషీటర్లపై నిరంతరం నిఘా పెట్టాలన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది పని చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఏ‌‌ఎస్‌‌ఐ వెంకటయ్య, సిబ్బంది ఉన్నారు.