గర్భిణి మృతి కేసులో.. నార్కట్‌‌‌‌‌‌‌‌పల్లి కామినేని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు రూ. కోటి ఫైన్‌‌‌‌‌‌‌‌

గర్భిణి మృతి కేసులో.. నార్కట్‌‌‌‌‌‌‌‌పల్లి కామినేని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు రూ. కోటి ఫైన్‌‌‌‌‌‌‌‌
  •  ఆదేశాలు జారీ చేసిన నల్గొండ వినియోగదారుల ఫోరం
  • డబ్బులను నెల రోజుల్లో బాధిత ఫ్యామిలీకి అందజేయాలని ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌
  • కామినేని డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా 2018లో గర్భిణి మృతి

చిట్యాల, వెలుగు : నల్గొండ జిల్లా నార్కట్‌‌‌‌‌‌‌‌పల్లి కామినేని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణిని చనిపోయిన కేసులో నల్గొండ జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు ఇచ్చింది. మృతురాలి ఫ్యామిలీకి రూ. కోటి పరిహారం అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే... నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారు ఆరెగూడెం గ్రామానికి చెందిన అస్నాల స్వాతి డెలివరీ కోసం 2018 జూలై 13న మధ్యాహ్నం 3.40 గంటలకు నార్కట్‌‌‌‌‌‌‌‌పల్లిలోని కామినేని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ఆడ్మిట్‌‌‌‌‌‌‌‌ అయింది. 

డాక్టర్లు స్వాతికి అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ చేసి బాబును బయటకు తీశారు. 14వ తేదీ ఉదయం 9.15 గంటల వరకు కూడా స్వాతి స్పృహలోకి రాకపోవడంతో స్వాతి కుటుంబసభ్యులు డాక్టర్లను ప్రశ్నించారు. ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ టైంలో ఇచ్చిన మత్తుమందు డోస్‌‌‌‌‌‌‌‌ సరిపోకపోవడంతో రెండో డోస్‌‌‌‌‌‌‌‌ ఇచ్చామని, స్పృహలోకి రావడానికి కాస్త టైం పడుతుందని డాక్టర్లు సమాధానం ఇచ్చారు. కానీ స్వాతి పరిస్థితిపై అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలకు సమాచారం ఇవ్వడంతో వారు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు చేరుకొని డాక్టర్లను నిలదీశారు. 

ఈ క్రమంలోనే స్వాతిని ఐసీయూలోకి తరలించారు. 14వ తేదీ ఉదయం ఎనిమిది గంటలైనా స్వాతి స్పృహలోకి రాకపోగా.. ఐసీయూలో స్వాతిని ఉంచిన బెడ్‌‌‌‌‌‌‌‌ మొత్తం రక్తంతో నిండిపోయింది. ఇదేమిటని కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో స్వాతి కోమాలోకి వెళ్లిందని, వంద మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని, ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నామని చెప్పారు. తర్వాత ఉదయం 9.15 గంటలకు స్వాతి భర్త క్రాంతికుమార్‌‌‌‌‌‌‌‌తో ‘హైరిస్క్’ పేపర్‌‌‌‌‌‌‌‌పై సంతకం చేయించుకున్నారు. ఓ గంటన్నర తర్వాత స్వాతి చనిపోయిందని ప్రకటించారు. దీంతో కామినేని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే స్వాతి చనిపోయిందంటూ ఆమె భర్త క్రాంతికుమార్‌‌‌‌‌‌‌‌, తండ్రి సత్యనారాయణ.. అడ్వకేట్‌‌‌‌‌‌‌‌ మేరెడ్డి నర్సింహారెడ్డి ద్వారా నల్గొండ జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు.

 ప్రతివాదులుగా కామినేని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ నిర్వాహకులతో పాటు డాక్టర్లు మాధవి, సునీతా మిశ్రా, ప్రసాద్, మారుతిని చేర్చారు. పూర్తిస్థాయిలో విచారించిన ఫోరం కామినేని డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే స్వాతి చనిపోయినట్లు నిర్ధారించి.. బాధిత కుటుంబానికి రూ. కోటి పరిహారం అందజేయాలని తీర్పు ఇచ్చింది. ఇందులో రూ. 90 లక్షలను స్వాతి కుమారుడు దేవాన్ష్‌‌‌‌‌‌‌‌ శౌర్య పేరున జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలని, మిగతా రూ. 10 లక్షలను స్వాతి తండ్రి సత్యనారాయణకు చెల్లించాలని ఆదేశించింది.

 మరో రూ. లక్ష ఫైన్‌‌‌‌‌‌‌‌గా విధించిన ఫోరం ఆ డబ్బులను సైతం బాధిత కుటుంబానికే చెల్లించాలని చెప్పింది. పరిహారం మొత్తాన్ని నెల రోజుల్లోగా చెల్లించాలని.. లేదంటే 9 శాతం వడ్డీని కలిపి చెల్లించాల్సి ఉంటుందని ఫోరం ఉత్తర్వులు జారీ చేసింది.