నకిరేకల్, వెలుగు: భూ వివాదాన్ని సాకుగా చూపు తూ సుపారి పేరిట ఓ వ్యక్తిని బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేసిన ఇద్దరు నిందితులను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిరేకల్ పీఎస్ లో మంగళవారం నల్లగొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. నకిరేకల్ టౌన్ కు చెందిన ముద్దం బాలరాజు కార్లను సెల్ఫ్ డ్రైవ్ కు ఇస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుంటాడు.
అతనికి నోములకు చెందిన సామ విక్రమ్ రెడ్డి తో పాత పరిచయం ఉంది. కాగా.. విక్రమ్ రెడ్డికి సొంతూరుకు చెందిన సామ సురేందర్ రెడ్డితో భూ తగాదా ఉంది. భూ పంచాయతీకి విక్రమ్ రెడ్డి తరఫున బాలరాజు పెద్ద మనిషిగా వెళ్లాడు. దీంతో విక్రమ్ రెడ్డి తండ్రి లింగారెడ్డితో పరిచయం పెరిగింది. నకిరేకల్ లో తన ఫ్లాట్ వివాదంలో ఉందని, రూ. 23 లక్షలు అప్పుగా ఇవ్వమని లింగారెడ్డిని బాలరాజు అడగడంతో లేవని చెప్పాడు.
దీంతో వివాదంలోని భూమి దక్కకుండా చేస్తానని బెదిరించడంతో భయపడిన లింగారెడ్డి రూ.23 లక్షలు అప్పుగా తీసుకొచ్చి ఇచ్చాడు. తిరిగి డబ్బులు ఇవ్వమని అడగడంతో బాలరాజు ఎగ్గొట్టాలని నిర్ణయించుకు ని, తన చిన్నమ్మ కొడుకు నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన దుంప సాయి కృష్ణతో ప్లాన్ చేశాడు.
విక్రమ్ రెడ్డిని చంపేందుకు సురేందర్ రెడ్డి రూ.40 లక్షలకు రౌడీ షీటర్ మెంటల్ రాజేశ్ కు సుపారీ ఇచ్చాడని లింగారెడ్డిని నమ్మించేందుకు సాయికి ఫోన్ చేశాడు. విక్రమ్ రెడ్డిని చంపేందుకు సురేందర్ రెడ్డి సుపారీ ఇచ్చాడని అతను చెప్పడంతో లింగారెడ్డి తీవ్ర భయాందోళన చెందాడు. రూ. 60 లక్షలు ఇస్తే విక్రమ్ రెడ్డిని చంపకుండా వదిలేస్తానని సాయితో బాలరాజు చెప్పించాడు.
లింగారెడ్డి తన 3 ఎకరాల నిమ్మతోటను అమ్మి బాలరాజుకు పలుమార్లు రూ. 63 లక్షలు ఇచ్చాడు. కాగా.. మెంటల్ రాజేశ్ జైలులో ఉన్నాడని తెలియడంతో బాలరాజు వద్దకు వెళ్లి డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగాడు. తనకు తెలిసిన రౌడీ షీటర్లు చాలామంది ఉన్నారని, లేదంటే నేనే చంపేస్తానని బెదిరించాడు. నాలుగు రోజుల కింద లింగారెడ్డి నకిరేకల్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.
దర్యాప్తు చేపట్టి నకిరేకల్ లో బాలరాజు, సాయిని అదుపులోకి తీసుకుని రెండు సెల్ ఫోన్లు, మూడు కార్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. గతంలో బాలరాజు ఓ కేసులో జైలుకు వెళ్లాడు. జల్సాలు.. ఆన్ లైన్ పేకాట ఆడుతుండేవాడు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో కేసును చేధించిన నకిరేకల్ సీఐ వెంకటేశ్, ఎస్ఐలు వీరబాబు, కృష్ణాచారి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
