Telangana Tour : శివుడి తలపై బిలం.. వాడపల్లి పుణ్యక్షేత్రం

Telangana Tour : శివుడి తలపై బిలం.. వాడపల్లి పుణ్యక్షేత్రం

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ తాలూకా దామరచర్ల మండలంలో ఉంది వాడపల్లి క్షేత్రం. ప్రభుత్వ రికార్డుల ప్రకారం వాడపల్లిని 'వజీరాబాదు' అని పిలుస్తారు. పూర్వం తీర ప్రాంతంలో పడవలు నడిపేవాళ్లు నిర్మించుకున్న 'వాడపల్లె' కాలక్రమేణ 'వాడపల్లి'గా మారింది. ఈ గ్రామం కృష్ణా, మూసీ నదుల సంగమ ప్రదేశంలో ఉంది. 12వ శతాబ్దంలో కాకతీయుల కాలం నాటి 'మీనాక్షీ అగస్తేశ్వర స్వామి' మందిరం ఇక్కడుంది. అంతేకాదు. కృష్ణా నదికి 120 మీటర్ల ఎత్తులో ఉన్న శివలింగం చాలా ప్రత్యేకం.

కృష్ణా, మూసీ నదుల సంగమ తీరంలోని వాడపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ అగస్త్యేశ్వరుడు కొలువై ఉన్నారు. జిల్లాలో అద్దంకి జాతీయ రహదారి సమీపంలోని భీమవరం మీదుగా వాడపల్లికి చేరుకోవచ్చు. ఆరు వేల సంవత్సరాల క్రితం ఆగస్త్య మహాముని తీర్ధయాత్రలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చాడని స్థల పురాణం. ఈ ప్రాంతంలో కృష్ణా, మూసీ (ముచికుండా) నదుల సంగమంలో స్నానం చేసి ఇక్కడే శివలింగంతో పాటు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ప్రతిష్ఠించారు. అయితే, రక్షణ లేకపోవడంతో కొంతకాలానికి విగ్రహాల చుట్టూ పుట్టలు ఏర్పడ్డాయి. 

మరో కథనం

ఒక రోజు బోయవాడు పక్షిని కొట్టబోతే... ఆ పక్షివచ్చి ఈ స్వామి వెనకాల దాక్కుందట. బోయవాడు వచ్చి పక్షిని ఇవ్వమని అడిగితే.. శివుడు నిరాకరించాడట. 'నాకు ఆకలిగా ఉంది" అని బోయవాడు శివుడితో చెప్పడంతో తన తల నుంచి కొంత మాంసం తీసుకోమని స్వామి చెప్పాడట. దీంతో బోయవాడు తన చేతులతో స్వామి తల నుంచి మాంసం తీసుకున్నాడట. ఆ వేళ్ల గుర్తులు శివలింగంపై ఇప్పటికీ కనబడటం విశేషం. స్వామి శిరస్సున ఏర్పడిన గాయాన్ని కడగడానికి గంగమ్మ వచ్చిందట. అందుకే బోయవాడు.

మాంసం తీయగా ఏర్పడిన గుంత నుంచి ఎప్పుడూ నీళ్లు ఊరుతూనే ఉంటాయి. క్రీస్తు శకం 1524వ సంవత్సరంలో శిష్యులతో కలిసి శ్రీ శంకరాచార్యులు వాడపల్లి క్షేత్రాన్ని దర్శించారు. అక్కడ శివుడి తలపై ఉన్న బిలం లోతు తెలుసుకోవాలనుకున్నారు. దీంతో ఒక ఉద్దరిణికి తాడు కట్టి బిలంలోకి వదిలారు. అయితే, తాడు లోపలికి వెళ్తూనే ఉంది తప్పు బిలం లోతు తెలియలేదు. దీంతో "నిన్ను పరీక్షించటానికి నేనెంత వాడను.. క్షమించు స్వామి' అని వేడుకున్న శంకరాచార్యులు శివుడికి పూజలు చేసి అక్కడి నదుల సంగమంలో పుణ్యస్నానం చేశారట. ఈ విషయాన్ని శంకరాచార్యులవారు రాయించిన శాసనం (ప్రాలీ భాషలో)లో ఉంది. ఈ శాసనం ఆలయంలో ఇప్పటికీ కనిపిస్తుంది. శాసనం ప్రకారం చాలా మంది ఇక్కడి కృష్ణా, మూసీ నదుల సంగమం ప్రాంతంలో అస్తికల నిమజ్జనం, కర్మకాండలు చేస్తుంటారు. 

రెడ్డి రాజుల పరిపాలన కాలంలో...

రెడ్డిరాజుల పరిపాలన కాలంలో వాడపల్లి ప్రాంతంలో రెండు వైపులా నీళ్లు, ఒక వైపు దారి ఉన్నట్టు గుర్తించారు. ఈ ప్రదేశంలో కోటతోపాటు ఇళ్లు కట్టుకుంటే సురక్షితంగా ఉంటాయని భావించారు. దీంతో ఇక్కడ నిర్మాణాలు చేపట్టిన పాలకులకు శివలింగం కనిపించడంతో ఆలయం కట్టించారు. నాడు చాలా ప్రసిద్ధి పొందిన ఈ ప్రాంతాన్ని అగస్త్యపురము, నర్సింహపురం, వీరభద్రపురం. పేర్లతో పిలిచేవాళ్లు. వాటి రెడ్డిరాజులు కట్టించిన నిర్మాణాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. కాగా, పదకొండు వందల ఏళ్లు సురక్షితంగా ఉన్న ఈ పట్టణం నిజాం మేనల్లుడు వజీర్ సుల్తాన్ ముట్టడితో నాశనమైంది. అయితే, వజీర్ సుల్తాన్ ఇక్కడి ఆలయాలకు ఎలాంటి నష్టం కలిగించలేదు. 

చారిత్రక సాక్ష్యాలు

అగస్తేశ్వరాలయం తూర్పు దిక్కుగా, సంగమాభి ముఖంగా ఉంటుంది. ఆలయంలోని శివుడి పానవట్టం ఎత్తుగా ఉంటుంది. దాని మీద లింగం మరోరెండు అడుగుల ఎత్తులో ఉంటుంది. లింగానికి వెండి కళ్లు, వాటి పైన వెండి నాగు పాము పడగ కనిపిస్తాయి. లింగం మీదున్న చిన్న గుంత నుంచి అన్నికాలాల్లో నీళ్లు ఊరుతుంటాయి. ఈ ఆలయంలో ఉండే ఒక దండం లాంటి వస్తువుతోపూజారి భక్తుల వీపు మీద కొడతారు. దుష్టగ్రహ నివారణ కోసమే అలా చేస్తారని. భక్తులు చెబుతారు. వాడపల్లికి నరసింహ స్వామి ఆలయం దక్షిణ ముఖంగా ఉంటుంది. 

ఎలా వెళ్లాలి

వాడపల్లి క్షేత్రానికి హైదరాబాద్ నుంచి బస్సులున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పిడుగురాళ్లకు వెళ్ళే బస్సులు వాడపల్లి మీదుగా వెళ్తాయి. రైలు మార్గం అయితే మిర్యాలగూడలో దిగి వాడపల్లికి బస్సులో వెళ్లాలి.