నల్గొండ అర్బన్, వెలుగు : రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా ఇన్‌చార్జి జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ జి. సంపూర్ణ ఆనంద్ అన్నారు. శనివారం నల్గొండ లోని జిల్లా కోర్టు లో రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్ అదాలత్ లో సివిల్ 31, క్రిమినల్ 2813, మోటార్ వాహన ప్రమాద కేసులు 45, చెక్కు బౌన్స్ కేసులు 06, సైబర్ క్రైమ్ కేసులు 26, మొత్తం 2921 (పెండింగ్, ప్రి-లిటిగేషన్) కేసులు పరిష్కరించినట్లు తెలిపారు.
ప్రమాద బీమా కేసులలో రూ.రూ 2 కోట్ల 95 లక్షల,35, వేల నష్టపరిహారం ఇప్పించగా, సైబర్ క్రైమ్ కేసులో రికవరీ డబ్బులు రూ.217915 ఇప్పించినట్టు తెలిపారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి పి.పురుషోత్తం రావు, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కట్ట అనంత రెడ్డి , మంద నగేష్, న్యాయవాదులు, లా కాలేజీ విద్యార్థులు, కక్షిదారులు సిబ్బంది పాల్గొన్నారు.
హుజూర్ నగర్, వెలుగు: కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకే లోక్ ఆదాలత్ లు ఉపయోగపడతాయని ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీనా అన్నారు. శనివారం హుజూర్ నగర్ కోర్టులో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ లోక్ ఆదాలత్‌లో 48 క్రిమినల్ కేసులు, 1 సివిల్ కేసు రాజీ ద్వారా పరిష్కరించారు. లోక్ అదాలత్ సభ్యులు చక్రాల వెంకటేశ్వర్లు, షేక్ సైదా హుస్సేన్, న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, ఎంఎస్ రాఘవరావు, శ్రీను నాయక్, పిడమర్తి చంద్రయ్య, జుట్టుకొండ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
నైతికతకు ప్రాధాన్యం ఇవ్వాలి
న్యాయవ్యవస్థలో న్యాయవాదుల పాత్ర కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద, జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీనా అన్నారు. శనివారం హుజూర్ నగర్ కోర్టులో న్యాయవాదులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. కేసుల పరిష్కారంలో నైతికతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
