నల్గొండలో వరద కాల్వ కబ్జా

నల్గొండలో వరద కాల్వ కబ్జా
  • మట్టితో పూడ్చేసి గేటు పెట్టి తాళం వేసిన ప్రైవేట్ వ్యక్తులు
  • మరోపక్క అదే డ్రైనేజీపై భారీ బిల్డింగ్​ నిర్మాణం
  • గత పాలకులకు వంతపాడిన మున్సిపల్​ అధికారులు 
  • భారీ వరదొస్తే.. రోడ్లు, ఇళ్ల మధ్య నుంచే డ్రైనేజీ వాటర్​ 

నల్గొండ, వెలుగు : నల్గొండ పట్టణంలో వరద కాల్వ కబ్జాకు గురైంది. అకాల వర్షాలకు పట్టణంలోని పలు ముఖ్యమైన ప్రాంతాల్లో వరద నీరంతా ఇండ్ల మధ్య నుంచి రోడ్ల మీదుగా ప్రవహిస్తుంటే.. మరోవైపు ఏకంగా మున్సిపాలిటీలోని 20వ వార్డులో బ్లైండ్ స్కూల్​ఆనుకుని ఉన్న వరద కాల్వను పలువురు ప్రైవేట్ వ్యక్తులు కబ్జా పెట్టారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరంతా ఈ కాల్వ గుండానే ప్రవహించి లెప్రసీ కాలనీ సమీపం లోని ట్రీట్మెంట్ ప్లాంట్ కు చేరుతుంది.

 జామా మసీదు నుంచి మొదలుకుని దాదాపు పట్టణంలో ప్రవహించే వరద మొత్తం ఇదే కాల్వ గుండా పట్టణం వెలుపలికిపోతుంది. అయితే, ఈ స్థలాన్ని కబ్జా పెట్టడంతో వరద నీరు ఒకే కాల్వ నుంచి పోతుంది. నల్గొండ పట్టణంలో గుట్టలు, సీసీ రోడ్లు ఉండడంతో వర్షాకాలంలో వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. పైనుంచే వచ్చే వరదంతా ఒకే వరద కాల్వ నుంచి వెళ్లడం వాటర్ ఫ్లో పెరిగి ఇండ్లలోకి, రోడ్ల మీదకు చేరుతుంది. దీంతో పాత వరద కాల్వను ఆనుకుని కొత్తగా మరో కాల్వను కూడా నిర్మించారు. అయితే ప్రైవేట్ వ్యక్తులు పాత వరద కాల్వను కబ్జా చేయడంతో డ్రైనేజీ వాటర్ అంతా ఎక్కడికక్కడే నిలిచిపోతుంది.

వరద కాల్వ ఆనవాళ్లు పూడ్చివేత..

బ్లైండ్​స్కూల్​మూసేయడంతో ప్రస్తుతం ఆ ప్లేస్​లో మరో ప్రైవేట్ స్కూల్​నడుస్తోంది. దీనికి ఆనుకునే వరద కాల్వ ఉంది. ఆ వరద కాల్వ అవతలి వైపు ప్రైవేట్ వ్యక్తులకు ఖాళీ జాగా ఉంది. దీంతో వరద కాల్వ మీద కన్నేసిన వాళ్లు ఏకంగా దాన్ని మట్టితో పూడ్చేశారు. వరద కాల్వ ఆనవాళ్లు బయటకు కన్పించకుండా పెద్ద ప్రహరీ గోడ నిర్మించారు. అదే వరద కాల్వ మీద టాయిలెట్లు కట్టారు. 

ఇంకోవైపు కారు పార్కింగ్​ కోసం పిల్లర్లు నిర్మించి పెద్ద షెడ్​ఏర్పాటు చేశారు. 20వ వార్డులో అసలే డ్రైనేజీ సమస్య అస్తవ్యస్తంగా ఉంది. అండర్​ గ్రౌండ్ డ్రైనేజీ లేకపో వడంతో రోడ్ల మీదనే మురుగు నీరు ప్రవహిస్తోంది. వరద కాల్వకు మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం భారీ ఎంతైన భవనాన్ని నిర్మించింది. ఒకరు స్థలాన్ని ఆక్రమిస్తే, ఇంకొకరు ఏకంగా బిల్డింగ్​ కట్టారు. గత మున్సిపల్ పాలకవర్గం వరద కాల్వ స్థలాన్ని తమకు రాసిచ్చిందని, వాళ్లతోనే అన్ని విషయాలు సెటిల్​చేసుకున్నాకే స్థలం ఆక్రమణకు గురైందని స్థానికులు ఫిర్యాదు చేశారు. వెయ్యి గజాలకు పైగా వరద కాల్వ నిర్మాణం ఉంటుందని, రెండు కోట్ల స్థలం ఆక్రమణకు గురైందని కాలనీవాసులు చెబుతున్నారు. 

చెరువును తలపిస్తున్న స్టేడియం..

వరద కాల్వ కబ్జాకు గురికావడంతో సమీపంలోని మేకల అభినవ్​అవుట్ డోర్ స్టేడియమంతా వరద నీటితో నిండిపోతుంది. ఒక చిన్నపాటి చెరువును తలపిస్తోంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు స్టేడియంలోకి చేరిన వరద నీరంతా బయటకు వెళ్లేందుకు దారిలేక అక్కడే ఆగిపోయింది. రోజుల తరబడి నీరంతా అక్కడే ఉండడంతో స్టేడియాన్ని ఆనుకుని ఉన్న ప్రజలు దోమలతో ఇబ్బంది పడటమేగాక, పాములు, తేళ్లు ఇళ్లలోకి వస్తున్నాయి.

స్టేడియం గోడకు ఆనుకునే ఓ ప్రైవేట్ స్కూల్ కూడా ఉంది. దీంతో వరద నీరు నిల్వ ఉండడంతో దుర్వాసనతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా రోడ్డు నిర్మించిన రోడ్డు స్టేడియం వెంట ఎత్తులో ఉండటంతో వచ్చిన వరద నీటిని బయటకు పంపేందుకు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల సమస్య తీవ్రమైంది. ఇక్కడి నుంచే కబ్జా గురైన వరద కాల్వకు లింక్​ కలపాల్సి ఉంది. కబ్జా చేసిన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడమేగాక, అక్రమ నిర్మాణాలను తొలిగిస్తే గానీ వరద ప్రవహానానికి అడ్డుకట్ట వేయలేమని మున్సిపల్​లోని శానిటేషన్​విభాగం ఆఫీసర్లు 
చెబుతున్నారు.