యూరియాకు నానో తో చెక్.. రసాయన ఎరువుల కన్నా నానో యూరియా ఎంతో ప్రయోజనం

 యూరియాకు నానో తో చెక్.. రసాయన ఎరువుల కన్నా నానో యూరియా ఎంతో ప్రయోజనం
  • రసాయన ఎరువుల కన్నా నానో యూరియా ఎంతో ప్రయోజనం 
  • అవగాహన లేక ఆసక్తి చూపని రైతులు 
  • సంప్రదాయ యూరియా కంటే తక్కువ ధర
  • అధిక లాభాలున్నాయంటున్న వ్యవసాయ అధికారులు

ఆదిలాబాద్, వెలుగు: యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. యూరియా అధికంగా వాడకూడదని శాస్త్రవేత్తలు సూచిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని చెబుతున్నా వినిపించుకోవడం లేదు. ప్రత్యామ్నాయాలపై అవగాహన లేక సంప్రదాయ యూరియాపైనే ఆధారపడుతున్నారు. యూరియాకు.. నానో యూరియాతో చెక్ పెట్టవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. లిక్విడ్ రూపంలో ఉండే నానో యూరియాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని, ధర కూడా తక్కువేనని చెబుతున్నారు. 

రైతులు అనాసక్తి..

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 5.80 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అత్యధికంగా 4.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ప్రస్తుతం పంటలు ఎదిగే దశలో ఉండడంతో రైతులు యూరియాను భారీగా వాడుతున్నారు. యూరియా కోసం కొనుగోలు కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. యూరియా దొరకదనే ఉద్దేశంతో కొంతమంది రబీ సీజన్ కోసం తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రత్యామ్నాయంగా ఉన్న నానో యూరియాపై మాత్రం దృష్టి పెట్టడంలేదు. 

సరైన అవగాహన లేకపోవడంతో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. యూరియా వినియోగాన్ని తగ్గించేలా ప్రభుత్వం ద్రవ రూపంలో ఉండే నానో యూరియాను అందుబాటులోకి తెచ్చినా ఇప్పటికీ 80 శాతం మంది రైతులకు దీనిపై అవగాహన లేదు. దీంతో ఎప్పటి లాగానే గుళికల రూపంలో యూరియాను కోసం ఎగబడుతున్నారు. 

నానోతో ప్రయోజనాలెన్నో..

నానో యూరియా ప్రస్తుతం మార్కెట్​లో అన్ని ఫర్టిలైజర్ షాపుల్లో అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నారు. అర లీటర్ నానో యూరియా బాటిల్ ను రూ.225 ధరకు అందిస్తున్నారు. పంట పొలంలో వేసిన రెండు గంటల్లోనే 70 శాతం నానో యూరియాను పంటలు తీసుకుంటాయి. వేసిన కొద్ది సమయానికే వర్షం పడ్డా పెద్దగా నష్టం ఉండదని అధికారులు చెబుతున్నారు. అర లీటర్ బాటిల్ ఒక ఎకరానికి సరిపోతుంది. దీని వాడడంతో పంటలకు, నేల సారానికి ప్రయోజనం ఉంటుందని, అధిక శాతం దిగుబడులు సైతం వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. 

అర లీటర్ నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాతో సమానమంటున్నారు. యూరియా బస్తా రూ.266 కాగా, నానో యూరియా అరలీటర్ కేవలం రూ.225కే లభిస్తోంది. నానో డీఏపీ ధర రూ.600కే దొరుకుతుండగా.. సాధారణ డీఏపీ బస్తాకు రూ.1350 ఉంది. అందుకే నానో యూరియా, డీఏపీ వాడడం ద్వారా తక్కువ ఖర్చులోనే పంటల దిగుబడి పెంచుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. నానో యూరియా బాటిళ్లను తీసుకెళ్లడం కూడా ఈజీనే.

అవగాహన కల్పిస్తున్నాం..

నానో యూరియాపై ఇప్పటికే ఆయా గ్రామాల్లో రైతులకు ఏవోలు, ఏఈవోలు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నానో యూరియాను వాడుతుండగా.. చాలామందికి అవగాహన లేకపోవడంతో వాడటం లేదు. నాను యూరియా పంటకు 70 శాతం అందుతుంది. మందు వేసిన రెండు గంటల్లోనే పంట పీల్చుకుంటుంది. ఆ తర్వాత వర్షం పడినా ఎలాంటి నష్టం ఉండదు. దిగుబడులు సైతం ఆశాజనకంగా ఉంటాయి. - శ్రీధర్ స్వామి, అగ్రికల్చర్ ఆఫీసర్, ఆదిలాబాద్