
నారాయణపేట, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో సర్వేయర్ల పాత్ర కీలకమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం వృత్తి నైపుణ్య కేంద్రంలో లైసెన్స్ డ్ సర్వేయర్స్ మొదటి బ్యాచ్ శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మొదటి బ్యాచ్ కింద 109 మందికి 50 రోజులు పాటు శిక్షణ ఇస్తామన్నారు. గెట్టు, భూమి హద్దులు, రెవెన్యూ చట్టాలు, హక్కుల గురించి తెలియజేస్తామన్నారు.
జిల్లాలో చాలా సర్వే సమస్యలు ఉన్నాయని, ప్రజావాణికి అధిక సంఖ్యలో భూ సర్వేకు సంబంధించిన వినతులే ఉంటున్నాయని చెప్పారు. నిరుద్యోగ యువత ఈ ట్రైనింగ్ పూర్తి చేసీ రైతులకు, ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం శిక్షణ మెటీరియల్ ను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సర్వే అధికారి గిరిధర్, డీఐలు థాను, తయాబ్ సుల్తానా, సర్వేయర్లు రంగయ్య, జయశంకర్, కృష్ణయ్య, రవి, రాజన్న, అరుణ పాల్గొన్నారు.
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ సంతోష్
గద్వాల: లైసెన్స్డ్సర్వేయర్ల కోసం ఎంపికైన అభ్యర్థులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్సంతోష్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ లో ఏర్పాటుచేసిన సర్వేయర్ల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లైసెన్స్ సర్వేయర్లతో భూ వివాదాల పరిష్కారంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించే ప్రణాళికలో భాగంగా లైసెన్స్ పొందిన సర్వేయర్లను అందుబాటులోకి తీసుకువస్తుందన్నారు. ఈ నెల 26 నుంచి 50 రోజుల పాటు 281 మందికి శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్వే ల్యాండ్ అండ్ రికార్డ్స్ ఏడీ రామచందర్ పాల్గొన్నారు.