
మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: భూ నిర్వాసితులకు అండగా ఉంటామని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి తెలిపారు. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల స్కీమ్‌లో 51.36 ఎకరాల భూములు కోల్పోయిన ఊట్కూరు మండలం బాపూర్, దామరగిద్ద మండలం బాపన్ పల్లి, నారాయణపేట మండలం పేరపళ్ల, కౌరంపల్లి శివారులోని 71 మంది రైతులకు సంబంధించిన రూ.7 .07 కోట్ల పరిహారం చెక్కులను బుధవారం ఆర్డీవో రాంచందర్ నాయక్ తో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు పరిహారం పూర్తి స్థాయిలో అందలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం డబ్బులు అందజేస్తున్నామని చెప్పారు.
నిర్వాసితులు నిరాశ చెందవద్దని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములను ఇవ్వడం అభినందనీయమన్నారు. ఏఎంసీ చైర్మన్ శివారెడ్డి, దామరగిద్ద పీఏసీఎస్ చైర్మన్ పుట్టి ఈదప్ప, నారాయణపేట, దామరగిద్ద, ఊట్కూరు తహసీల్దార్లు అమరేంద్ర కృష్ణ, తిరుపతయ్య, చింత రవి పాల్గొన్నారు.
మరికల్: రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి తెలిపారు. మరికల్లో కొత్తగా ఏర్పాటు చేసిన హాకా రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులకు కావాల్సిన ఎరువులు, క్రిమిసంహారక మందులు, యూరియా అందుబాటులో ఉంటుందని తెలిపారు. సూర్యమోహన్‌రెడ్డి, వీరణ్ణ, గొల్ల కృష్ణయ్య, రఘుపతిరెడ్డి, రామన్‌గౌడ్, కేడీఆర్, హరీశ్, పి.రామకృష్ణ పాల్గొన్నారు.