ఎన్డీఏకు 400.. బీజేపీకి 370 సీట్లు .. ప్రధానిగా మళ్లీ నేనే

ఎన్డీఏకు 400.. బీజేపీకి 370 సీట్లు .. ప్రధానిగా మళ్లీ నేనే
  • ఎన్డీఏకు 400.. బీజేపీకి 370 సీట్లు .. ప్రధానిగా మళ్లీ నేనే
  • బీజేపీ నేషనల్ కన్వెన్షన్​లో నరేంద్ర మోదీ ధీమా
  • కాంగ్రెస్​పై ప్రజలకు నమ్మకం పోయింది
  • మమ్మల్ని ఆ పార్టీ ఎదుర్కోలేదు అందుకే నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నది
  • బీజేపీదే మళ్లీ అధికారం.. డౌట్ అక్కర్లేదని వ్యాఖ్య

న్యూఢిల్లీ: ‘‘నేను మూడో సారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. దేశ సేవ కోసమే తప్ప అధికారాన్ని అనుభవించాలని కాదు. నా ఇంటి గురించి మాత్రమే ఆలోచించి ఉంటే.. కోట్లాది మందికి ఇండ్లు కట్టించి ఇచ్చే అవకాశం దక్కేది కాదు’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్​కు లేదని, అందుకే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నదని మండిపడ్డారు. భారత్ మండపంలో నిర్వహిస్తున్న బీజేపీ నేషనల్ కన్వెన్షన్​కు మోదీ చీఫ్ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. ప్రజలకు కాంగ్రెస్ అంటే నమ్మకం పోయిందన్నారు. లోక్​సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదన్నారు. రానున్న 100 రోజులు ఎంతో కీలకమన్న మోదీ.. యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు మరింత ఉత్సాహంగా పనిచేయాలని పార్టీ నేతలను కోరారు. ‘‘2047 నాటికి ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా నిలుస్తది. దీని కోసం ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకు వెళ్లాలి. దేశాభివృద్ధికి రానున్న ఐదేండ్లు ఎంతో కీలకం. మాది ‘వికసిత్ భారత్’ నినాదం. అత్యధిక సీట్లు సాధించి మళ్లీ అధికారంలోకి వస్తాం’’ అని మోదీ పేర్కొన్నారు.

400కు పైగా సీట్లు వస్తయ్

‘‘మాకు 400కు పైగా సీట్లు వస్తాయని అపోజిషన్ పార్టీ లీడర్లే పార్లమెంట్​లో గొంతు చించుకుని అరుస్తున్నరు. బీజేపీ 370కు పైగా స్థానాల్లో గెలుస్తది. ప్రతి దేశం ఇండియాతో ఫ్రెండ్​షిప్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నది. ఇంకా ఎన్నికలే జరగలేదు.. కానీ, జులై, ఆగస్టు, సెప్టెంబర్​లో తమ దేశానికి రావాల్సిందిగా చాలా మంది అధ్యక్షులు ఇన్విటేషన్లు పంపిస్తున్నారు. ఇండియాలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు’’ అని మోదీ అన్నారు. దేశంలోని కోట్లాది మంది మహిళలు, పేదలు, యువత కలలు నెరవేర్చడమే తమ ధ్యేయమని తెలిపారు. ఇండియాను టెర్రర్ ఫ్రీ దేశంగా మార్చామన్నారు. స్కామ్​లకు ఆస్కారం లేకుండా పాలన అందించామని, పేద, మధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు కృషి చేశామని తెలిపారు.

25 కోట్ల మంది పేదరికం నుంచి బయటికి.. 

పదేండ్ల పాలనలో ఎలాంటి అవినీతి మచ్చలేదని మోదీ అన్నారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని తెలిపారు. ‘‘నేను ప్రధానిగా, సీఎంగా బాగా చేశానని..  ఓ సీనియర్ లీడర్ నాతో అన్నారు. ఇక రెస్ట్ తీసుకోవాలని సూచించారు. నేను రాష్ట్రనీతి కోసం పని చేస్తున్నాను.. రాజనీతి కోసం కాదని నేను ఆయనకు జవాబిచ్చా. ఛత్రపతి శివాజీ మహరాజ్ స్ఫూర్తిగా పాలన అందిస్తున్నా. మహిళా సాధికారత కోసం మిషన్ శక్తి తీసుకొచ్చాం. 15 వేల స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు అందజేశాం. మోడ్రన్ అగ్రికల్చర్ కోసం ‘డ్రోన్ దీదీ’లు తమవంతు సహకారం అందిస్తారు. కర్తార్ పూర్ సాహిబ్ హైవే, ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్, అయోధ్య రామాలయం వంటి ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నాం’’ అని మోదీ స్పష్టం చేశారు. 

రేపు కాశ్మీర్ పర్యటనకు మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ క్రమంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు డెవలప్​మెంట్ ప్రాజెక్ట్​లను మోదీ ప్రారంభించనున్నారు. జమ్మూలో ఎయిమ్స్ హాస్పిటల్, చీనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన, ఉధంపూర్​లోని దేవిక నది ప్రాజెక్ట్​తో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ఓపెనింగ్ చేస్తారు.  సంగల్దాన్ – బారాముల్లా రైల్వే లింక్​ను మోదీ జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆ తర్వాత జమ్మూలో జరిగే పబ్లిక్ ర్యాలీలో మాట్లాడే అవకాశం ఉంది.

కాంగ్రెస్ కూటమి అవినీతిమయం: అమిత్ షా

రాబోయే లోక్​సభ ఎన్నికలు మహాభారత యుద్ధం లాంటిదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ‘ఒకవైపు దేశాభివృద్ధి కోసం పనిచేస్తున్న పాండవుల (బీజేపీ) కు మోదీ నాయకత్వం వహిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి.. దేశ సూత్రాలు అనుసరిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఉంది. ఇది కౌరవులతో సమానం. కూటమి కుటుంబ పార్టీలు, అవినీతితో నిండింది. ఎవరికి అధికారం ఇవ్వాలనేది ప్రజలు నిర్ణయిస్తారు’’ అని చెప్పారు.