నర్సాపూర్​ మున్సిపల్..​చైర్మన్ ​రిజైన్​

నర్సాపూర్​ మున్సిపల్..​చైర్మన్ ​రిజైన్​
  • బీఆర్ఎస్​కౌన్సిలర్ల నోటీస్
  • పదవి నుంచి తప్పుకున్న మురళీ యాదవ్​
  •  కొత్త చైర్మన్​ ఎవరనేదానిపై ఆసక్తి

మెదక్, నర్సాపూర్, వెలుగు : నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ తన పదవికి రిజైన్​చేశారు. వైస్​ చైర్మన్ తో సహా తొమ్మిది మంది కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీస్​ ఇవ్వగా దానిపై కలెక్టర్​ ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే మురళీయాదవ్​చైర్మన్​ పదవి నుంచి స్వచ్చందంగా తప్పుకున్నారు. 2020 మున్సిపల్​ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచి  చైర్మన్ అయ్యారు.  తర్వాత బీఆర్ఎస్  పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని 2021 ఆగస్టులో ప్రెస్ మీట్​పెట్టి పార్టీ హైకమాండ్​, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్​పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఆయనను బీఆర్ఎస్​ నుంచి సస్పెండ్ చేయగా బీజేపీలో చేరారు.

పార్టీ మారిండని..

బీఆర్ఎస్​ నుంచి కౌన్సిలర్​గా గెలిచి చైర్మన్​ అయిన మురళీ యాదవ్​ బీజేపీలో చేరడంతో ఆయను ఎలాగైనా గద్దె దించాలని బీఆర్ఎస్​ భావించింది. ఈ మేరకు గత ఫిబ్రవరిలోనే వైస్​చైర్మన్​ సహా ఎనిమిది మంది కౌన్సిలర్లు  కలిసి మురళీ యాదవ్​ మీద అవిశ్వాసం ప్రకటిస్తూ కలెక్టర్​కు నోటీస్​ఇచ్చారు. అయితే ఏ కారణంచేతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మురళీ యాదవ్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలో అతన్ని మున్సిపల్​ చైర్మన్​ పదవి నుంచి దించేందుకు బీఆర్ఎస్ మరోమారు అవిశ్వాసం అస్త్రాన్ని ప్రయోగించింది.

వైస్ చైర్మన్ నయీమొద్దీన్​ సహా 9 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇటీవల అడిషనల్ కలెక్టర్ కు అవిశ్వాసం నోటీస్ ఇచ్చారు. ఆ పార్టీకి మెజారిటీ కౌన్సిలర్ల​బలం ఉండడంతో తన పదవి పోవడం ఖాయమని భావించి ముందుగానే మురళీ యాదవ్ రాజీనామా చేశారు. ఇప్పుడు కొత్త చైర్మన్ ఎవరవుతారనేది ఆసక్తికరంగా మారింది. 

అశోక్​గౌడ్ ఆశలు..

కౌన్సిల్​లో బీఆర్ఎస్ 9 మంది కౌన్సిలర్లు ఉండగా వారిలో 6వ వార్డు కౌన్సిలర్​గా గెలిచి వైస్ చైర్మన్ అయిన నయీమొద్దీన్ ఇన్‌చార్జి చైర్మన్​గా నియమితులయ్యే అవకాశం ఉంది. కాగా మున్సిపల్​ పాలకవర్గ పదవీ కాలం ఇంకా ఏడాది ఉండగా, ఒకటో వార్డు కౌన్సిలర్​ అశోక్ గౌడ్ చైర్మన్​ పదవి ఆశిస్తున్నట్టు తెలిసింది. పార్టీలో సీనియర్​ లీడర్​ అయిన అశోక్​ గౌడ్​ మున్సిపల్​ ఎన్నికల సమయంలోనే చైర్మన్​ పదవి ఆశించారు.

అయితే పార్టీ హైకమాండ్​ మురళీ యాదవ్​కు అవకాశం ఇచ్చింది.  చైర్మన్​ పదవి ఆశించిన అశోక్​ గౌడ్​ భార్యకు వ్యవసాయ మార్కెట్​ కమిటీ చైర్మన్​ పదవి ఇచ్చింది. కాగా ఇప్పుడు మరోసారి అవకాశం రావడంతో అశోక్​ గౌడ్​ మున్సిపల్​ చైర్మన్​ పదవి కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. 

ప్రజాక్షేత్రంలో ఉండి పనిచేస్తా

​చైర్మన్​ పదవికి రాజీనామా చేసినప్పటికీ  ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తానని మురళీయాదవ్ అన్నారు. చైర్మన్​ పదవికి రాజీనామా చేసిన అనంతరం గురువారం మున్సిపల్ ఆఫీసులో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలకే పరిమితమైందని, నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేయలేదని, చేసిన పనులకు డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు.  

రాయరావు చెరువును మినీ ట్యాంక్ బండ్ చేస్తానన్న హామీ ఇప్పటికీ నెరవేరనేలేదన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీ పై వివక్ష చూపారని, స్వయంగా అప్పటి సీఎం కేసీఆర్ మంజూరు చేసిన నిధులు సైతం విడుదల కాలేదన్నారు. త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఆయన వెంట కౌన్సిలర్లు గోడ రాజేందర్, సంఘసాని సురేశ్, యాదగిరి, లత, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు చిన్న రమేశ్ గౌడ్ ఉన్నారు.

మురళీ యాదవ్