
చంద్రునిపై దిగుతూ జాడ తెలియకుండా పోయిన చంద్రయాన్ 2 ల్యాండర్ విక్రమ్ ఆచూకీ కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా రంగంలోకి దిగింది. ప్రస్తుతం చంద్రుని చుట్టూ తిరుగుతున్న తన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్‌తో విక్రమ్ ఎక్కడుందో వెతికే పనిలో పడింది. తన ఆర్బిటర్ ద్వారా విక్రమ్ ల్యాండింగ్ సైట్ ప్రాంతంలో సెప్టెంబర్ 17న ఫొటోలు తీయనుంది. వాటిని విశ్లేషణ కోసం ఇస్రోకు పంపనుంది. ఇప్పటికే డీప్ స్పేస్ నెట్‌వర్క్ (డీఎస్ఎన్) ద్వారా విక్రమ్‌కు నాసా సిగ్నళ్లు పంపుతున్న సంగతి తెలిసిందే. విక్రమ్‌తో కమ్యూనికేషన్ పునరుద్ధరించాలనే ఇస్రో ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. అయితే రోజులు గడిచేకొద్దీ అవకాశాలు తగ్గిపోతున్నాయి. చంద్రుడిపై ఒక్క రోజు (మనకు 14 రోజులు) పని చేసేలా విక్రమ్‌ను, ప్రజ్ఞాన్ రోవర్‌ను రూపొందించారు. చంద్రుడి ఉపరితలంపై సూర్యకిరణాల సాయంతో విద్యుత్‌ను తయారుచేసుకునేలా వాటి సోలార్ ప్యానళ్లను డిజైన్ చేశారు. ఇవి సెప్టెంబర్ 20 నుంచి 21 వరకే పనిచేస్తాయి.
ఆర్బిటర్‌తో చాలా చేయొచ్చు: ఏఎస్ కిరణ్‌కుమార్
విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయినంత మాత్రాన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైనట్టు కాదని ఇస్రో మాజీ చీఫ్ ఏఎస్ కిరణ్‌కుమార్ అన్నారు. ల్యాండింగ్ మినహా మిగతా ప్రయోగమంతా పర్ఫెక్ట్‌గా జరిగిందని చెప్పారు. 10 ఏళ్ల కిందట పంపిన చంద్రయాన్ 1 కన్నా 2 ఆర్బిటర్ శక్తిమంతమైందన్నారు. గతంలో ఒక సింథటిక్ అపర్చర్ రాడార్‌నే వాడామని, ఇప్పుడు రెండు ఫ్రీక్వెన్సీ రాడార్లు వినియోగించామని వివరించారు. వెరీ హై రిజొల్యూషన్ కెమెరాలు, మంచి స్పెక్ట్రల్ రేంజ్‌ను వాడామని చెప్పారు. చంద్రయాన్ 2లో చివరి 15 నిమిషాలు చాలా కీలకమని ఇస్రో సైంటిస్టులు అప్పట్లో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, అలాంటి పదాలు వాడడమెందుకు అని ఇస్రో సీనియర్ సలహాదారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి పదాలతో సైన్స్‌కు సైంటిస్టులు చెడు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
మోడీ వల్లే చంద్రయాన్ 2 ఆగింది: కుమారస్వామి
ఇస్రో కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అడుగు పెట్టినందుకే సైంటిస్టులకు దురదృష్టం పట్టుకుందని, ప్రయోగం విఫలమైందని కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు. చంద్రయాన్-2 ప్రయోగాన్ని తాను చేస్తున్నట్లు పబ్లిసిటీ ఇవ్వడం కోసమే సెప్టెంబర్ 6న మోడీ బెంగళూరుకు వచ్చారన్నారు. చంద్రయాన్ 2 కోసం సైంటిస్టులు దాదాపు 12 ఏళ్లు శ్రమించారని, యూపీఏ హయాంలో 2008–09లోనే ప్రయోగానికి కేబినెట్ అనుమతి ఇచ్చిందని చెప్పారు. ఏదైనా విషయాన్ని మోడీకి చెప్పేందుకు రాష్ట్రంలో గానీ, కేంద్రంలో గానీ ఎవరికీ ధైర్యం లేదని కుమారస్వామి అన్నారు. ‘కర్నాటక సీఎం యడియూరప్ప, డిప్యూటీ సీఎం, ఇద్దరు, ముగ్గురు కేంద్ర మంత్రులు కూడా ఇస్రో సెంటర్‌కు వెళ్లారు. కానీ మీ అవసరం లేదంటూ వాళ్లను మోడీ పంపించేశారు. వాళ్లు తోకముడిచి వచ్చేశారు’ అని ఎద్దేవా చేశారు.