‘టెంపో’ ఇన్​స్ట్రుమెంట్​ను పంపిన నాసా

‘టెంపో’ ఇన్​స్ట్రుమెంట్​ను పంపిన నాసా

కేప్ కానవెరాల్: అంతరిక్షం నుంచి భూమిపై ఎయిర్ పొల్యూషన్​ను మానిటర్ చేస్తూ ప్రతి గంటకు ఒకసారి సమాచారాన్ని అందజేసే సరికొత్త సైంటిఫిక్ ఇన్ స్ట్రుమెంట్​ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా  తొలిసారిగా స్పేస్ కు పంపింది. శుక్రవారం ఫ్లోరిడాలోని కేప్ కానవెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఇంటెల్ శాట్ 40ఈ ఉపగ్రహాన్ని నాసా విజయవంతంగా భూస్థిర కక్ష్యకు చేర్చింది. మాక్సర్ టెక్నాలజీస్ కంపెనీ తయారు చేసిన ఇంటెల్ శాట్ 40 ఈలో బాల్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన టెంపో (ట్రోపోస్పియరిక్ ఎమిషన్స్: మానిటరింగ్ ఆఫ్ పొల్యూషన్) ఇన్ స్ట్రుమెంట్ ను అమర్చారు. 

భూమధ్య రేఖ మీదుగా భూస్థిర కక్ష్యలో తిరిగే ఇంటెల్ శాట్ 40ఈలోని టెంపో పరికరం యూఎస్ఏ, కెనడా, మెక్సికో, క్యూబా, బహమాస్ సహా ఉత్తర అమెరికా అంతటా ఎయిర్ పొల్యూషన్ లెవల్స్ ను నిరంతరం పర్యవేక్షించనుందని నాసా వెల్లడించింది. ట్రాఫిక్ రద్దీగా ఉండే సమయాల నుంచి మొదలుకొని కార్చిచ్చులు, అగ్నిపర్వతాల పేలుళ్లతో ఏర్పడే పొల్యూషన్ వరకూ అనేక రకాల సమాచారాన్ని ఇది అందిస్తుందని, భూమిపై ఎరువుల వాడకం వల్ల వాతావరణంపై కలుగుతున్న ప్రభావాన్ని కూడా ఇది స్టడీ చేస్తుందని తెలిపింది. 

వాతావరణంలోని నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ఓజోన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాటిపై సైంటిఫిక్ డేటాను గణనీయంగా మెరుగుపరుస్తుందని వెల్లడించింది. ‘‘టెంపో అందించే సమాచారం అందరికీ అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు.. అస్తమా పేషెంట్లు ఈ సమాచారాన్ని తెలుసుకుని తాముండే  ప్రాంతంలో పొల్యూషన్ లెవల్స్​ను బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు” అని నాసా పేర్కొంది.