హలో విక్రమ్​..దిస్​ ఈజ్​ నాసా

హలో విక్రమ్​..దిస్​ ఈజ్​ నాసా

విక్రమ్​లో ఎలాంటి చలనం లేకపోయినా ఇస్రో పలకరిస్తూనే ఉంది. ఎప్పుడో అప్పుడు అది స్పందించకపోతుందా అన్న చిన్న ఆశ. ఒక్క మన ఇస్రోనే కాదు, విక్రమ్​ పలకాలని దేశం మొత్తం కోరుకుంటోంది. అయినా అది మాట వినదే. ఇప్పుడు నాసా కూడా మన విక్రమ్​ను కదిలించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అదేపనిగా హలో మెసేజ్​లు పంపుతోంది. ‘హలో విక్రమ్​.. దిస్​ ఈజ్​ నాసా’ అంటూ మెసేజ్​లు చేరవేస్తోంది. నేషనల్​ ఏరోనాటిక్స్​ అండ్​ స్పేస్​ అడ్మినిస్ట్రేషన్​ (నాసా)కు చెందిన డీప్​ స్పేస్​ నెట్​వర్క్​(డీఎస్​ఎన్​) గ్రౌండ్​ స్టేషన్స్​ నుంచి జెట్​ ప్రొపల్షన్​ లేబొరేటరీ (జేపీఎల్​) విక్రమ్​కు రేడియో ఫ్రీక్వెన్సీలను పంపుతోంది. ఈ విషయాన్ని నాసా వర్గాలే స్వయంగా వెల్లడించాయి. ‘‘అవును, నాసా, జేపీఎల్​లు విక్రమ్​తో లింక్​ కలిపేందుకు ప్రయత్నిస్తున్నాయి. డీఎస్​ఎన్​ల నుంచి సిగ్నళ్లను పంపుతున్నాయి. ఇప్పటికే దీనిపై ఇస్రోతో ఒప్పందమూ ఉంది” అని నాసా అధికారి ఒకరు చెప్పారు.

కాలిఫోర్నియాలోని డీఎస్​ఎన్​ నుంచి విక్రమ్​కు రేడియో తరంగాలు పంపామని నాసా సైంటిస్ట్​ స్కాట్​ టిల్లీ చెప్పారు. 2005లో నాసా గూఢచర్య ఉపగ్రహం ఇమేజ్​తో లింక్​ తెగిపోయినప్పుడు అదెక్కడుందో కనిపెట్టింది ఆయనే. ఇప్పుడు విక్రమ్​పై ఆయన స్పందించారు. ‘‘విక్రమ్​ నుంచి సిగ్నళ్లను రాబట్టేందుకు డీఎస్​ఎన్​ 24, 12 కిలోవాట్ల రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను పంపుతోంది. విక్రమ్​ను తిరిగి లైన్​లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఎర్త్​ మూన్​ ఎర్త్​ (ఈఎంఈ) నుంచి 2013లో సెర్చర్​ సిగ్నళ్లు చంద్రుడికి, అక్కడి నుంచి భూమికి వచ్చాయి. అది రికార్డయింది కూడా” అని టిల్లీ ట్వీట్​ చేశారు. ఆ రికార్డింగ్​ను ట్వీట్​లో పోస్ట్​ చేశారు. డీఎస్​ఎన్​ 24 నుంచి రెండు రోజులుగా సిగ్నళ్లు పంపుతున్నామని, ఇతర డీఎస్​ఎన్​లూ అదే పనిలో ఉండి ఉంటాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్న గోల్డ్​స్టోన్​, స్పెయిన్​లోని మాడ్రిడ్​, ఆస్ట్రేలియాలోని కాన్​బెర్రాల్లో నాసా డీఎస్​ఎన్​ స్టేషన్లున్నాయి. ఈ మూడు స్టేషన్లను 120 డిగ్రీల కోణంలో ఏర్పాటు చేశారు. ఒక్కో స్టేషన్​కు నాలుగు పెద్ద పెద్ద యాంటెన్నాలుంటాయి. 26 మీటర్ల నుంచి 70 మీటర్ల వ్యాసంతో అవి ఉంటాయి. అవన్నీ కూడా ఒకేసారి అంతరిక్షంలోని శాటిలైట్లకు సిగ్నళ్లను చేరవేస్తాయి.

అందుకే నాసాకు ఆసక్తి

విక్రమ్​పై నాసా ఇంత ఆసక్తి కనబరచడానికి కారణం లేకపోలేదు. అందులో మొదటిది విక్రమ్​లో ఏర్పాటు చేసిన పాసివ్​ పేలోడ్​ లేజర్​ రిఫ్లెక్టర్​ అర్రే. ఈ పాసివ్​ పేలోడ్​తో విక్రమ్​ ఎక్కడుందన్నది తెలుసుకోవచ్చు. అంతేగాకుండా భూమి–చంద్రుడి మధ్య దూరం ఎంతుందో కచ్చితంగా లెక్కించొచ్చు. రెండింటి మధ్య దూరం ఎంతుందో తెలిస్తే భవిష్యత్​ ప్రయోగాలు మరింత సులభం అవుతాయి. ఈ పేలోడ్​ను నాసానే తయారు చేసింది. 2024లో నాసా ఆర్టిమిస్​ ప్రయోగం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విక్రమ్​ హార్డ్​ ల్యాండింగ్​ అవడంతో నాసా పేలోడ్​పై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అందుకే నాసా విక్రమ్​ను కదిలించేందుకు ప్రయత్నిస్తోంది. ఇంకో కారణం, చంద్రయాన్​ 2 ఆర్బిటర్​లో 8 అత్యాధునిక పేలోడ్లున్నాయి. అవి చంద్రుడి గోళం మొత్తాన్ని ఫొటో తీసేయగలవు. కాబట్టి ఆర్బిటర్​ పంపించే చందమామ దక్షిణ ధ్రువం త్రీడీ ఫొటోల కోసం నాసా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆర్టిమిస్​ మిషన్​కు ఆ ఫొటోలూ కీలకం కానున్నాయి. ఎందుకంటే ఆ మిషన్​లోనూ చందమామ దక్షిణ ధ్రువంపైకి నాసా ఆస్ట్రోనాట్లను పంపిస్తోంది మరి.

తర్వాతి ప్రయోగాలపై దృష్టి పెట్టండి

ప్రస్తుతం విక్రమ్​ హార్డ్​ ల్యాండింగ్​పై ఇస్రోలోని ఇంటర్నల్​ ఫెయిల్యూర్​ అనాలిసిస్​ కమిటీ (ఎఫ్​ఏసీ) విశ్లేషిస్తోంది. దీనిపై సోమవారం ఇస్రో చైర్మన్​ సైంటిస్టులతో సమావేశమైనట్టు తెలుస్తోంది. విక్రమ్​ హార్డ్​ల్యాండింగ్​పై ఆందోళన చెందొద్దని సైంటిస్టులకు ఆయన చెప్పినట్టు సమాచారం. తర్వాత చేయబోయే ప్రయోగాలపైనే దృష్టి పెట్టాలని సూచించారని ఇస్రో అధికారి ఒకరు చెబుతున్నారు. బైలాలులోని ఇస్రో డీఎస్​ఎన్​కు చెందిన 32 మీటర్ల యాంటెన్నాతో విక్రమ్​ను కాంటాక్ట్​ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని, నాసా జేపీఎల్​ కూడా సహకరిస్తోందని ఇస్రో సైంటిస్ట్​ ఒకరు చెప్పారు. యాంటెన్నాలు సరైన దిశలోనే ఉన్నాయని, కాంటాక్ట్​ కావడానికి విక్రమ్​కు కరెంట్​ అవసరమని మరో సైంటిస్ట్​ చెప్పారు.

ఇస్రోకు అతిథులొచ్చారు

చంద్రయాన్​2 ప్రయోగం తర్వాత ఇస్రోకు నాసా, కాల్టెక్​ (కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ)కి చెందిన అతిథులు వచ్చారు. కాల్టెక్​ ప్రొఫెసర్​ డేవిడ్​ టిరెల్​తో పాటు అమెరికా డిపార్ట్​మెంట్​ ఆఫ్​ స్పేస్​ మంత్రి, జేపీఎల్​ డిప్యూటీ డైరెక్టర్​ జనరల్​ లారీ జేమ్స్​ వచ్చారని ఇస్రో తెలిపింది. బుధవారం వాళ్లు బెంగళూరులోని ఇస్రో ఆఫీసుకు వచ్చారని వెల్లడించింది. కాల్టెక్​ సీనియర్​ అధికారులూ వచ్చారని చెప్పింది. అయితే, వాళ్లు ఎందుకు వచ్చారన్న విషయం మాత్రం ఇస్రో చెప్పలేదు.