కోహ్లీ లేడు..టెస్ట్ సిరీస్ గెలవడానికి ఇదే సరైన సమయం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

కోహ్లీ లేడు..టెస్ట్ సిరీస్ గెలవడానికి ఇదే సరైన సమయం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

వ్యక్తిగత కారణాల వలన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. కోహ్లీ లేకపోవడం భారత్ కు పెద్ద లోటనే చెప్పాలి. మిడిల్ ఆర్డర్ లో ఈ స్టార్ బ్యాటర్ ను భర్తీ చేయాలంటే చాలా కష్టం. ఇప్పటికే సీనియర్లను పట్టించుకోని సెలక్టర్లు విరాట్ స్థానంలో దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ లేదా రజత్ పటిదార్ ను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడని వీరిద్దరూ ఒత్తిడిని తట్టుకొని రాణించడం ఛాలెంజింగ్ గా మారింది. ఇదే విషయం గురించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ స్పందించాడు.

తొలి రెండు టెస్టులకు కోహ్లీ లేకపోవడం ఇంగ్లండ్ కు అనుకూలంగా మారుతుందని అన్నారు. మొదటగా విరాట్ కోహ్లీకి మనం శుభాకాంక్షలు తెలియజేయాలి. బ్రూక్ వలె అతను కూడా వ్యక్తిగత కారణాల వలన మొదట రెండు టెస్టులు ఆడట్లేదు. ప్రతి ఒక్కరు దీనిని గౌరవించాలి. క్రికెట్ కంటే కొన్ని ముఖ్యమైన విషయాలు ఉంటాయి. టీమిండియా కోహ్లీని ఖచ్చితంగా మిస్ అవుతుందని హుస్సేన్ తెలిపాడు.      

కోహ్లిలాంటి స్టార్ ఆటగాడి సేవలను కోల్పోవడం ఏ జట్టుకైనా తీరని లోటని..ఈ సిరీస్ లో అండర్ డాగ్ గా బరిలోకి దిగుతున్న ఇంగ్లండ్ కు ఈ విషయం కలిసొస్తుందని ఈ మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉండగా.. వ్యక్తిగత కారణాల వలన ఇంగ్లండ్ యంగ్ సంచలనం హ్యారీ బ్రూక్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఫామ్ లో ఉన్న బ్రూక్ దూరమవ్వడం ఇంగ్లండ్ మిడిల్ ఆర్డర్ బలహీనంగా కనిపిస్తుంది. 

భారత్ రానున్న నెలన్నర పాటు ఇంగ్లాండ్ తో టెస్టులు ఆడనుంది. జనవరి 25 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ మార్చ్ 11 తో ముగుస్తుంది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు గురువారం (జనవరి 25) హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియం లో జరగనుంది. విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాలలో వరుసగా 2,3,4,5 టెస్టులు ఆడాల్సి ఉంది