నేషనల్
ఆస్కార్‌కు ‘లాపతా లేడీస్’
అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ సినిమా 97వ ఆస్కార్ పోటీలకు అధికారికంగా ఎంపికైంది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా ప్రకటించింది. 2025 మార్చి 2వ తేదీ ఆస్కార్ అవార్డుల వేడుక అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో జరుగనుంది.
ఉత్తమ పర్యాటక గ్రామం దేవ్‌మాలీ
రాజస్థాన్‌లోని అజ్‌మేర్ సమీప బ్యావర్ జిల్లాకు చెందిన దేవ్‌మాలీ భారత్‌లో ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. దేవ్‌మాలీ ప్రత్యేకత ఏమిటంటే.. గ్రామానికి చెందిన 3,000 బీఘాల (1,875 ఎకరాల) భూమిని స్థానికంగా కొండపై వెలసిన దేవనారాయణ్ స్వామికి అంకితం చేశారు.
మూడో భారీ ఎకానమీ దిశగా భారత్
భారత్ త్వరలో మూడో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవించనుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 3.9 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత భారత్ అయిదో స్థానంలో ఉంది. యావత్ ప్రపంచం కోసం ఉత్పత్తులు, సేవలను రూపొందించేందుకు, ఉత్పత్తి చేసేందుకు భారత్‌తో చేతులు కలపాలని అమెరికాలో జరిగిన సీఈవోల సదస్సులో పేర్కొన్నారు.
పోర్టుబ్లెయిర్ ఇకపై శ్రీ విజయపురం
అండమాన్, నికోబార్ దీవుల రాజధాని పోర్టుబ్లెయిర్ పేరు మారుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై దీనిని శ్రీ విజయపురంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు.
తెలంగాణ
వరి దిగుబడిలో తెలంగాణ టాప్
వరి దిగుబడిలో తెలంగాణ 2023-–24లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. పత్తిలో 3, పొద్దుతిరుగుడులో 4, మొక్కజొన్న, చిరుధాన్యాల్లో 5వ స్థానంలో నిలిచింది. దేశంలో ప్రధాన పంటల దిగుబడుల తుది అంచనాలను కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసింది.
ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా (ఎస్‌ఈసీ) రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఐ.రాణీ కుముదిని నియమితులయ్యారు. ఆమె ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ
నేవీలో చేరిన ఐఎన్‌ఎస్ విక్రాంత్
అరేబియా సముద్రంలో స్వదేశీ సముద్ర శక్తిని మరింత బలోపేతం చేసేందుకు దేశీయంగా తయారైన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ పశ్చిమ నౌకాదళంలో చేరింది. సముద్రం, ఆకాశం, భూమిపై ఒకేసారి కార్యకలాపాలు నిర్వహించి, దేశ భద్రతను ఇది కాపాడుతుంది.
ఇంటర్నేషనల్
అమెరికాలో క్వాడ్ సమ్మిట్
అమెరికాలో డెలావెర్‌లోని విల్మింగ్టన్‌లో క్వాడ్ దేశాల అధినేతల శిఖరాగ్ర సమావేశం జరిగింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్యమిచ్చిన ఈ సదస్సులో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులు ఆంథోనీ అల్బనీస్, ఫుమియో కిషిదా పాల్గొన్నారు. శాంతి సౌభాగ్యాలతో కూడిన ఇండో–పసిఫిక్‌కు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
శ్రీలంక అధ్యక్షుడిగా దిసనాయకే
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నేత అనూర కుమార దిసనాయకే ప్రమాణస్వీకారం చేశారు. శ్రీలంకకు అనూర కుమార దిసనాయకే తొమ్మిదో అధ్యక్షుడు కాగా.. తొలి వామపక్ష అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు. ఈ ఫలితాల్లో అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే తొలి రౌండ్‌లోనే వైదొలిగారు.