ముక్రా సర్పంచ్​కు జాతీయ అవార్డు

ముక్రా సర్పంచ్​కు జాతీయ అవార్డు

న్యూఢిల్లీ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) సర్పంచ్ గాడ్గె మీనాక్షి ‘స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్–2023’ అవార్డు అందుకున్నారు. స్వచ్ఛ్ భారత్ గ్రామీణ్ విభాగంలో ఆమెకు ఈ అవార్డు దక్కింది. కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మీనాక్షికి అవార్డు అందజేశారు. 220 ఇండ్లున్న ఇచ్చోడ గ్రామం.. సర్పంచ్ మీనాక్షి నేతృత్వంలో 2021లో ఓడీఎఫ్ ప్లస్ కేటగిరీలో చోటు దక్కించుకుంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్​లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ (ఎస్‌‌‌‌బీ ఎంజీ), జల్ జీవన్ మిషన్ (జేజేఎం) అమలులో మహిళలు చేస్తున్న అసాధారణమైన పనిని అభినందించేందుకు అవార్డులు అందించింది. దేశవ్యాప్తంగా 36 మంది మహిళలకు అవార్డులు దక్కాయి. ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని గాడ్గె మినాక్షి అన్నారు. 

దేశంలో 11.3 కోట్ల కుటుంబాలకు ట్యాప్ వాటర్

ప్రస్తుతం దేశంలో 11.3 కోట్ల కుటుంబాలకు ట్యాప్ ద్వారా తాగునీరు అందుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు. అవార్డుల ప్రదానోత్సవానికి ఆమె చీఫ్ గెస్ట్​గా హాజరయ్యారు. ‘జల్ శక్తి అభియాన్: క్యాచ్ ది రెయిన్ -– 2023’ ప్రోగ్రాంను ఆవిష్కరించారు. ప్రతి పౌరుడి జీవితంలో నీరు, పారిశుధ్యానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఇంతకుముందు సుదూర ప్రాంతాల నుంచి నీళ్లు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడే మహిళలు, ఇప్పుడా సమయాన్ని ఇతర పనులకు వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.