వేజ్ బోర్డు చర్చలు బహిష్కరించిన జాతీయ బొగ్గు గని కార్మిక సంఘాలు

వేజ్ బోర్డు చర్చలు బహిష్కరించిన  జాతీయ బొగ్గు గని కార్మిక సంఘాలు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: బొగ్గు గని కార్మికులకు సంబంధించిన వేజ్ బోర్డు చర్చలను జాతీయ కార్మిక సంఘాలు బహిష్కరించాయి. బుధవారం కోల్​కతాలో కోల్ ఇండియా యాజమాన్యం, సింగరేణితోపాటు దేశంలోని బొగ్గు పరిశ్రమల చైర్మన్లు, డైరెక్టర్లు, జాతీయ కార్మిక సంఘాలైన బీఎంఎస్, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్​సంఘాల ప్రతినిధులతో జేబీసీసీఐ(జాయింట్​బైపార్టెడ్​కమిటీ ఫర్ ద కోల్ ఇండస్ట్రీ) సమావేశం నిర్వహించింది. బీఎంఎస్​కోల్ సెక్టార్​నేషనల్ ఇన్​చార్జ్​కొత్తకాపు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో యూనియన్ల ప్రతినిధులు సమావేశాన్ని బహిష్కరించారు.

గతేడాది జులై 1తో పదో వేతన ఒప్పందం గడువు ముగియగా, 11వ వేతన కమిటీ సమావేశాలు ఇప్పటివరకు ఆరుసార్లు జరిగాయి. బుధవారం జరిగే ఏడో సమావేశంలోనైనా ఒప్పందం కుదురుతుందని కార్మికులు భావించారు. కాగా మినిమం గ్యారెంటీ బెనిఫిట్(ఎంజీబీ) పెరుగుదలపై కోల్ ఇండియా యాజమాన్యానికి, జేబీసీసీఐ సంఘాలకు మధ్య ఒప్పందం కుదరలేదు. ఎంబీజీ విషయంలో కోల్ ఇండియా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందని కొత్తకాపు లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలను బహిష్కరించి బయటికి వచ్చేసినట్లు ప్రకటించారు. ఎంజీబీ 50 శాతం పెంచాలని కార్మిక సంఘాలు మొదటి నుంచి డిమాండ్​చేస్తున్నాయి. చివరికి జాతీయ కార్మిక సంఘాలు 28 శాతానికి తగ్గగా, కోల్ ఇండియా యాజమాన్యం మాత్రం10 శాతం దగ్గరే ఆగిపోయింది. ఈ నెల 9న దేశవ్యాప్తంగా అన్ని బొగ్గు కంపెనీల్లో ప్రొటెస్ట్ డే/డిమాండ్ డే నిర్వహించాలని, జనవరి 7న రాంచీలో నాలుగు సంఘాల సమ్మేళనం నిర్వహించి తదుపరి ఆందోళనలపై కార్యాచరణ తెలియజేస్తామని లక్ష్మారెడ్డి ప్రకటించారు.