ఇండియన్ సినీ పరిశ్రమలో తనదైన ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. టోక్యోలోని ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రిన్స్ హోటల్ షిన్ టకానావా వేదికగా మే 23, 2026న జరగనున్న 10వ క్రంచీరోల్ అనిమే అవార్డ్స్ (Crunchyroll Anime Awards) లో ఆమె ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నారు. 2024లో ఈ వేదికపై మెరిసిన తొలి భారతీయ సెలబ్రిటీగా చరిత్ర సృష్టించిన రష్మిక, ఇప్పుడు రెండోసారి ఈ గౌరవాన్ని అందుకోవడం విశేషం.
గ్లోబల్ ఐకాన్‌గా రష్మిక..
రష్మిక కేవలం ఒక నటిగానే కాకుండా, భారతీయ పాప్ సంస్కృతికి ప్రపంచవ్యాప్త ప్రతినిధిగా ఎదుగుతున్నారు. క్రంచీరోల్ ఆమెను 'ఇండియాస్ స్వీట్‌హార్ట్' అని సంబోధిస్తూ, భారతీయ అనిమే ఫ్యాన్ బేస్‌ను గ్లోబల్ కమ్యూనిటీతో కలిపే వారధిగా అభివర్ణించింది. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో అగ్ర కథానాయికగా రాణిస్తున్న ఆమె, క్రంచీరోల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా సేవలందిస్తున్నారు.
అట్టహాసంగా వేడుకలు
ఈ ఏడాది అనిమే అవార్డ్స్ 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో వేడుకలు ఎంతో వైభవంగా జరగనున్నాయి. రష్మికతో పాటు అసుకా సైటో (జపాన్), డాన్నా (మెక్సికో), హన్నా బాంగ్ (ఆస్ట్రేలియా), హాలీవుడ్ నటుడు విన్స్టన్ డ్యూక్ వంటి ప్రముఖులు ప్రజెంటర్ల జాబితాలో ఉన్నారు.
ఏషియన్ కుంగ్-ఫు జనరేషన్, యోకో తకహషి వంటి ప్రముఖులతో పాటు టోక్యో ఫిల్‌హార్మోనిక్ ఆర్కెస్ట్రా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఏప్రిల్ 15 వరకు అభిమానులు తమకు నచ్చిన అనిమేలకు క్రంచీరోల్ వెబ్‌సైట్, 'మై అనిమే లిస్ట్' ద్వారా ఓటు వేయవచ్చు. ఈ ఏడాది 'డాన్ డా డాన్ సీజన్ 2', 'మై హీరో అకాడెమియా' వంటి అనిమే సిరీస్‌లు అవార్డుల రేసులో ముందంజలో ఉన్నాయి.
వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం
ఇటీవలే రష్మిక టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండను వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత ఆమె కెరీర్‌లో ఇది ఒక భారీ అంతర్జాతీయ మైలురాయిగా నిలవనుంది. జపాన్ వేదికగా రష్మికను ప్రజెంటర్ గా ఎంపిక చేయడంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ - రష్మిక జంటగా కలిసి 'రణబాలి 'మూవీలో కూడా నటిస్తున్నారు.
