తగ్గేదే లే .. నేషనల్​ ఫిల్మ్​ అవార్డ్స్​లో దుమ్మురేపిన  తెలుగు సినిమా

తగ్గేదే లే .. నేషనల్​ ఫిల్మ్​ అవార్డ్స్​లో దుమ్మురేపిన  తెలుగు సినిమా
  • 11 కేటగిరీల్లో పురస్కారాలు
  • ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. 
  • ఈ అవార్డుకు ఎంపికైన తొలి టాలీవుడ్​ స్టార్​గా రికార్డు
  • ‘ఆర్​ఆర్​ఆర్​’కు ఆరు.. ‘పుష్ప’కు రెండు పురస్కారాలు
  • బెస్ట్​ లిరిసిస్ట్​గా చంద్రబోస్​.. బెస్ట్​ మ్యూజిక్​ డైరెక్టర్​గా దేవిశ్రీ ప్రసాద్​
  • ఉత్తమ గాయకుడిగా కాలభైరవ.. ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన
  • జాతీయ ఉత్తమ చిత్రంగా ‘రాకెట్రీ’ 
  • ఉత్తమ నటిగా ఆలియా భట్​, కృతి సనన్​

న్యూఢిల్లీ:  తెలుగు సినిమా మరోసారి సత్తా చాటింది. తొలిసారిగా నేషనల్​ బెస్ట్​ యాక్టర్​ అవార్డుతోపాటు వివిధ కేటగిరీల్లో మొత్తం 11 అవార్డులను సొంతం చేసుకుంది. పుష్ప మూవీలో నటనకు గాను అల్లు అర్జున్​ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆస్కార్​ వేదికపై దుమ్మురేపిన ‘ఆర్​ఆర్​ఆర్​’కు ఏకంగా ఆరు పురస్కారాలు దక్కాయి. వరంగల్​ బిడ్డ, ఆస్కార్​ విన్నర్​ చంద్రబోస్​ను జాతీయ ఉత్తమ గేయ రచయిత అవార్డు వరించింది.

‘కొండపొలం’ సినిమాలో ఆయన రాసిన ‘ధంధం ధం.. తిరిగేద్దాం’ పాట ఇందుకు సెలెక్ట్​ అయింది. 69వ నేషనల్​ ఫిల్మ్​ అవార్డులను గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ నటి పురస్కారానికి అలియా భట్ (గంగూబాయి మూవీ), కృతిసనన్ (మీమీ మూవీ)​ను ఎంపిక చేసింది. ఇక, జాతీయ ఉత్తమ చిత్రంగా ‘రాక్రెటీ: ది నంబీ ఎఫెక్ట్’ నిలిచింది. సైంటిస్ట్​ నంబి నారాయణన్​ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో నంబి పాత్రను మాధవన్​ పోషించారు. 

69 ఏండ్ల చరిత్రలో ఫస్ట్ టైమ్​

పుష్ప అంటే ఫ్లవరనుకుంటివా.. ఫైర్​..! తగ్గేదే లే..’ అంటూ తన యాక్టింగ్​లోని అన్ని షేడ్స్​ను ‘పుష్ప’లో ప్రదర్శించిన స్టైలిష్​  స్టార్​ అల్లు అర్జున్​ ఉత్తమ నటుడిగా రికార్డు సృష్టించారు.  69 ఏండ్ల నేషనల్​ ఫిల్మ్​ అవార్డుల చరిత్రలో తెలుగు స్టార్​కు బెస్ట్​ యాక్టర్​ అవార్డు దక్కడం ఇదే ఫస్ట్​ టైమ్​.  

దీంతో టాలీవుడ్​ ఫుల్​ ఖుషీలో ఉంది. అల్లు అర్జున్​ ఇంటికి సినీ ప్రముఖులు, అభిమానులు పోటెత్తారు. ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పుష్ప సినిమాకు మ్యూజిక్​ కేటగిరీలోనూ అవార్డు దక్కింది. దేవీశ్రీ ప్రసాద్​ ఉత్తమ సంగీత దర్శకుడిగా సెలెక్ట్​ అయ్యారు.  

‘ఆర్​ఆర్​ఆర్​’ అదుర్స్​

ఆస్కార్​ వేదికపై తెలుగు సినిమా ఖ్యాతిని చాటిన ‘ఆర్​ఆర్​ఆర్​’ జాతీయ సినీ అవార్డుల్లోనూ దూసుకుపోయింది. బెస్ట్​ పాపులర్​ మూవీ అవార్డుతోపాటు మరో ఐదు అవార్డులు దీనికి దక్కాయి. ఈ సినిమాలో పనిచేసినందుకు గాను బెస్ట్ మ్యూజిక్ (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్​) కేటగిరీలో కీరవాణికి, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ కేటగిరీలో  కింగ్ సాలమన్ కు, బెస్ట్ కొరియోగ్రఫీ కేటగిరీలో ప్రేమ్ రక్షిత్​కు,  బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్  కేటగిరీలో శ్రీనివాస మోహన్​కు,  బెస్ట్ సింగర్  కేటగిరీలో కాలభైరవ (‘కొమురం భీముడో..’ పాటకు)కు అవార్డులను  కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

తొలి అడుగుతోనే ‘ఉప్పెన’లా..!

జాతీయ ఉత్తమ ప్రాంతీయ (తెలుగు) చిత్రంగా ‘ఉప్పెన’ నిలిచింది. వైష్ణవ్​ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా సాన బుచ్చిబాబు ఈ సినిమాకు తెరకెక్కించారు. హీరోగా వైష్ణవ్​ తేజ్​కు, హీరోయిన్​గా కృతి శెట్టికి, డైరెక్టర్​గా బుచ్చిబాబుకు ఇదే ఫస్ట్​ మూవీ. తొలి చిత్రంతోనే వీళ్లు సత్తా చాటారు. వైష్ణవ్​ తేజ్​ నటించిన రెండో చిత్రం ‘కొండపొలం’లోని పాటకు కూడా అవార్డు దక్కింది. ఇక, తెలుగు సినీ విశ్లేషకుడు, విమర్శకుడు పురోషోత్తమాచార్యులు బెస్ట్​ ఫిల్మ్​ క్రిటిక్​ పురస్కారానికి ఎంపికయ్యారు.  

ఓరుగల్లు పాటగాడికి మరో పట్టం

ఓరుగల్లు బిడ్డ చంద్రబోస్​ను జాతీయ ఉత్తమ గేయ రచయిత అవార్డు వరించింది. ‘‘ధంధం ధం.. తిరిగేద్దాం, ధంధం ధం దొర్లేద్దాం.. ధం ధం ధం దయసూపాలని అడవిని అడిగేద్దాం..” అంటూ కొండపొలం సినిమాలో అడవి తల్లికి ఆయన అల్లిన పాటకు ఈ పురస్కారం దక్కింది. ‘ఆర్​ఆర్​ఆర్​’ చిత్రంలో ‘నాటు నాటు’ పాటకుగాను ఇప్పటికే అంతర్జాతీయ సినీ పురస్కారం ‘ఆస్కార్​’ను సొంతం చేసుకున్న చంద్రబోస్​కు.. జాతీయ గేయ రచయిత అవార్డు ఓ కల. ఇప్పుడు ఆ కల కూడా నెరవేరింది.

31 కేటగిరీల్లో ఫీచర్​ఫిల్మ్స్​

2021వ సంవత్సరానికి గానూ 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను జ్యూరీ హెడ్​ కేతన్​మెహతా గురువారం ప్రకటించారు. 28 భాషల్లో 280  ఫీచర్ ఫిల్మ్స్, 23 భాషల్లో  158 నాన్ ఫీచర్ ఫిల్మ్స్  నేషనల్ అవార్డ్ కోసం ఎంట్రీ ఇచ్చినట్టు జ్యూరీ కమిటీ తెలిపింది. వీటిలో 31 కేటగిరీల్లో ఫీచర్ ఫిల్మ్స్‌కు,  24 కేటగిరీల్లో నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌కు, మూడు కేటగిరీల్లో బెస్ట్ రైటింగ్ అవార్డులను ప్రకటించింది. వివేక్​ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘కశ్మీర్​ ఫైల్స్​’ నేషనల్​ ఇంటిగ్రేషన్​ ఉత్తమ చిత్రం కేటగిరీలో నర్గీస్​ దత్ అవార్డుకు ఎంపికైంది. గంగూబాయి చిత్రానికి ఐదు కేటగిరీల్లో పురస్కారాలు దక్కాయి. అవార్డులు అందుకున్న చిత్రాల్లో కొన్ని   2022లో టాకీసుల్లో విడుదలయ్యాయి. 2021 అవార్డులకు వీటిని ఎంపిక చేయడం ఏమిటని కమిటీని ప్రశ్నించగా.. నిబంధనల ప్రకారం  2021 జనవరి నుంచి 2021 డిసెంబర్​ వరకు సర్టిఫై పొందిన వాటిని పరిగణనలోకి తీసుకున్నామని తెలిపింది.