నేషనల్ ఫిల్మ్ అవార్డులలో ఆర్ఆర్ఆర్ జోరు

నేషనల్ ఫిల్మ్ అవార్డులలో ఆర్ఆర్ఆర్ జోరు

ఆస్కార్ అవార్డుతో గ్లోబల్ లెవెల్‌‌లో గుర్తింపును అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్‌‌ అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇండియాలో ప్రెస్టీజియస్ అవార్డుగా భావించే నేషనల్ ఫిల్మ్ అవార్డులు సైతం తన ఖాతాలో వేసుకుంది. ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఆరు కేటగిరీల్లో ఈ చిత్రానికి నేషనల్ అవార్డు వరించింది. ఇండియా వైడ్‌‌గా ఎక్కువ ప్రజాదరణ పొందిన చిత్రంగా బెస్ట్ పాపులర్ ఫీచర్ ఫిల్మ్‌‌ అవార్డును ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గెలుచుకుంది.

అలాగే బ్యాక్‌‌గ్రౌండ్ మ్యూజిక్‌‌కి గాను కీరవాణి అవార్డుకు ఎంపిక అయ్యారు. ‘కొమురం భీముడో’ పాటకు గానూ బెస్ట్ సింగర్‌‌‌‌గా కాలభైరవ నిలిచాడు. ఒకే సినిమాకు తండ్రి, కొడుకు అవార్డును అందుకోనుండటం విశేషం.  ఇక ‘నాటు నాటు’ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌‌ చేత అద్భుతమైన స్టెప్పులు వేయించిన ప్రేమ్ రక్షిత్‌‌ మాస్టర్..  బెస్ట్ కొరియోగ్రాఫర్‌‌‌‌ అవార్డును గెలుచుకున్నారు.

బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్‌‌కి గాను  శ్రీనివాస మోహన్,  బెస్ట్ యాక్షన్ డైరెక్షన్‌‌కి కింగ్ సాలమన్ జాతీయ పురస్కారాలు అందుకోనున్నారు. ఇక కీరవాణి ట్యూన్ చేసిన ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డును అందుకోగా, జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో మాత్రం పాటలకు కాకుండా బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌‌కి అవార్డు రావడం గమనార్హం.