
బక్సర్: కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలని కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని.. అయినా తమ నేతలు భయపడరని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. నేషనల్హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ వంటి ప్రముఖులను ఇరికించి కాంగ్రెస్నేతల స్థైర్యాన్ని దెబ్బతీయాలని మోదీ చూస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రజలను కులమతాల పేరిట విభజించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర పన్నుతున్నాయని.. వక్ఫ్ ఇష్యూనే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. పేదలు, మహిళలు, బలహీనవర్గాల ప్రజలంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్కు నచ్చదని అన్నారు.
బిహార్‌లోని బక్సర్‌లో ఆదివారం జరిగిన ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ర్యాలీలో ఖర్గే మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌పై మోదీ సర్కార్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నది. కుట్రపూరితంగా సోనియా, రాహుల్‌పై నేషనల్ హెరాల్డ్ కేసులో ఇరికించాలని చూస్తున్నది. దీని ద్వారా కాంగ్రెస్ నేతలను భయపెట్టాలనుకుంటున్నది. మా పార్టీ నేతలు ఎవరికీ భయపడరు. ఎవరి ముందూ తలవంచరు” అని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని.. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారని ఆయన తెలిపారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష నేతలపైకి ప్రయోగిస్తూ వాటిని మోదీ సర్కార్ దుర్వినియోగం చేస్తున్నదని మండిపడ్డారు.
నితీశ్‌కుమార్‌కు సీటే ముఖ్యం
బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌కు పదవులే ముఖ్యమని.. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ‘‘నితీశ్కుమార్ది కుర్సీ కోసం ఆరాటం. సీఎం కుర్చీ కోసం పార్టీలు, కూటములు మారడం ఆయనకు పరిపాటి. బిహార్‌లోని జేడీయూ, బీజేపీలది అవకాశవాద కూటమి” అని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ కూటమికి ప్రజలు బుద్ధిచెప్తారని ఆయన హెచ్చరించారు.